డబుల్‌ బెడ్‌రూం ఇండ్లా.. మూసుకొని పొండి..

– ఎవడిస్తున్నాడు.. ఎవడు డ్రా తీస్తున్నాడో వాడినే అడుక్కోండీ..
– ఇండ్ల సమాచారం అడిగిన వారిపై డీసీ దురుసు ప్రవర్తన
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఉప్పల్‌
‘డబుల్‌ బెడ్‌రూం ఇండ్లా.. ఎక్కడ. మూసుకొని దొబ్బేయండీ. ఎవడిస్తున్నాడు.. ఎవడు డ్రా తీస్తున్నాడో వాడినే అడుక్కోండీ..’ అంటూ డీసీ దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల సమాచారం అడిగిన కొందరు మహిళలతో ఉప్పల్‌ మున్సిపల్‌ డీప్యూటీ కమిషనర్‌ (డీసీ) అన్న వ్యాఖ్యలివి. వివరాల్లోకెళ్తే..
డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వివరాల కోసం వందల సంఖ్యలో మహిళలు మంగళవారం ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చారు. ఉప్పల్‌, చిలుకానగర్‌, హబ్సిగూడా, రామంతాపూర్‌ సర్కిల్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఉదయమే కార్యాలయానికి వచ్చారు. గంటల తరబడి వేచిచూశారు. తమకు ఇండ్లు రాలేదని కొందరు, డ్రాలో పేరు లేదని, ఇంకొందరు స్థానికంగా వార్డు కార్యాలయాల్లో ఎలాంటి వివరాలూ చెప్పడం లేదని, ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-2 కార్యాలయంలో తెలుసుకోవాలంటూ చెప్పారని తెలిపారు. మరికొందరు లిస్టులో తమ పేర్లు ఉన్నా పూర్తి సమాచారం తెలియడం లేదని చెప్పారు. వివరాల కోసం ఆరా తీశారు. అయినా డబుల్‌బెడ్‌ రూం ఇండ్ల వివరాలకు సంబంధించి ఎలాంటి సమాచారమూ లభించలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉప్పల్‌ డీసీ కార్యాలయానికి వచ్చారు. ఇది గమనించిన మహిళలు ఆయనతో మాట్లాడేందుకు గదిలోకి వెళ్లారు. ‘మాకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు రాలేదు సార్‌..’ అని అడిగారు. దాంతో ఆగ్రహంలో ఊగిపోయిన డీసీ ‘ఇక్కడికి ఎందుకొచ్చారు.. మూసుకొని దొబ్బేయండీ… ఎవడిస్తున్నాడో.. ఎవడు డ్రా తీస్తున్నాడో వాడినే అడుక్కోండీ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కంగుతిన్న మహిళలు అవేమి మాటలు సార్‌.. మహిళలతో ఇలా మాట్లాడుతావా అంటూ నిలదీశారు. ఈలోగా ఇతర అధికారులు, సిబ్బంది వచ్చి మహిళలకు నచ్చజెప్పారు. గ్రేటర్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లేదని, అర్హులకు కాకుండా అనర్హులకే ఇండ్లు కేటాయిస్తున్నారని బాధిత మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల నుంచి తిరిగిపోతున్నా ఎలాంటి సమాచారమూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి లిస్టు, రెండో లిస్టును జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా ఎందుకు బయట పెట్టడం లేదని, అంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు. సమాచారం అడిగితే మహిళలని చూడకుండా అధికారులు దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
తూతూ మంత్రంగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ సర్వే సీపీఐ(ఎం) నాయకులు వెంకన్న
ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని రామంతాపూర్‌, హబ్సిగూడా, చిల్కానగర్‌ ఉప్పల్‌లో క్షేత్రస్థాయిలో అధికారులు సరిగ్గా పరిశీలన చేయకపోవడంతో నిజమైన లబ్దిదారులకు ఇండ్లు దక్కడం లేదు. ఇప్పటికైనా లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి.