విధుల్లో నిర్లిప్తత పనికిరాదు

– అటవీశాఖ జిల్లా అధికారి కృష్ణ
నవతెలంగాణ – ఆళ్ళపల్లి: అటవీశాఖ ఉద్యోగులకు విధుల పట్ల నిర్లిప్తత పనికిరాదని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని భద్రాద్రి కొత్తగూడెం అటవీశాఖ జిల్లా అధికారి కృష్ణ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం ఈస్ట్, సౌత్, చింతోళ్లగుంపు ఈస్ట్ బీట్లలో ఫారెస్ట్ ట్రెంచ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిన్నెరసాని పరివాహక వైల్డ్ లైఫ్ పరిధిలోని అడవుల్లో చెట్లను నరకడం, జంతువులను వేటాడటం చేయొద్దని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే శాఖా పరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమంగా కలపను తరలించే వారిపై, వాహనాలపై సైతం కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వేసవి దృష్ట్యా జంతువులకు దాహార్తిని తీర్చేందుకు నీటి సౌకర్యం కల్పించాలని సిబ్బందికి చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అడవుల్లో ఎరగడి పెట్టకూడదన్నారు. డీ.ఎఫ్.ఓ వెంట కిన్నెరసాని వైల్డ్ లైఫ్ ఎఫ్.డీ.ఓ బాబు నాయక్, ఆళ్ళపల్లి రేంజర్ కె.నరసింహారావు, తదితరులు ఉన్నారు.