– ఆర్డీవోలదే కీలక బాధ్యత
– ప్రభుత్వం నిర్దేశించిన ప్రొఫార్మాలోనే వివరాలు అందివ్వాలి
– కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టం అంచనా వివరాలను ఆదివారం మధ్యాహ్నం లోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నష్టం అంచనాలపై శనివారం అయన విపత్తు నిర్వహణ జిల్లా ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ తో కలిసి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించిందని, అందువల్ల ఆదివారం మధ్యాహ్నం వరకు పూర్తి అంచనా వివరాలను పంపించాలని ఆయన ఆదేశించారు. వర్షాలు,వరదల వల్ల జిల్లాలో ఎక్కడైనా మనుషులు, పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయినట్లయితే వివరాలను తహసిల్దార్లు వెంటనే పంపించాలని ఆదేశించారు. పశువులు గొర్రెలు ,మేకల వివరాలను తహసిల్దార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ద్వారా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పంపించాలని సూచించారు.వర్షాలకు పూర్తిగా పడిపోయిన పక్కా, కచ్చా ఇండ్లు,పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల వివరాలను,వర్షాలకు కొట్టుకుపోయిన గుడిసెలు వంటి వాటి వివరాలను పంపించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాలలో తహసిల్దార్ తో పాటు, మున్సిపల్ కమిషనర్లు ఈ వివరాలు పంపాలని, ముఖ్యంగా పడిపోయిన ఇండ్ల ఫోటోలు, బాధితుల పేర్లు, కుటుంబ వివరాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తో పాటు, ఇతర వివరాలను పంపించాలని ఆదేశించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సర్వేనెంబర్, రైతు వారిగా, ఎకరాల వారిగా సమర్పించాలని, అంతేకాక మత్స్య సంపదకు కలిగిన నష్టాన్ని సైతం వివరాలు పంపాలని చెప్పారు. అదేవిధంగా వర్షాలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బి రహదారులు, పంచాయతీ రహదారుల నష్టం వివరాలను సంబంధిత కార్యదర్శులకు పంపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సైతం వివరాలు పంపించాలని, ఆయన ఆదేశించారు. అలాగే తెగిపోయిన చెరువులు, బుంగ పడిన చెరువుల వివరాలు ను నీటిపారుదల శాఖ అధికారులు సమర్పించాలని అన్నారు.
నష్టం అంచనా వివరాలను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రతి అధికారి పరిశీలించి ఫోటోలతో సహా సమర్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వివరాలు పంపించాలని, సంబంధిత ట్రాన్స్కో ఏఈలు ప్రత్యక్షంగా చూసి సందర్శించి వివరాలను నివేదిక పంపించాలని చెప్పారు. పాఠశాల భవనాలు, హాస్టల్ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర కమ్యూనిటీ హాల్ వంటి వివరాలను సైతం సంబంధిత శాఖల అధికారులు తక్షణమే వివరాలు సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి వనరులు దెబ్బతిని ఉంటే వాటి వివరాలను సైతం పంపించాలని, పంట నష్టం, ఇతర నష్టం వివరాలను నూటికి నూరు శాతం సరైనవిగా ఉండాలని, ఇండ్లకు సంబంధించి, చనిపోయిన వారికి సంబంధించిన వివరాలను ఆర్డీవోలు ప్రత్యక్షంగా దగ్గరుండి పరిశీలించాలని, మొత్తం నష్టం వివరాలపై ఆర్డీవోలదే కీలక బాధ్యత అని ఆయన తెలిపారు . అన్ని రకాల నష్టం అంచనా వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రొఫార్మాలోనే సమర్పించాలని ఆదేశించారు.ఈ టెలికాన్ఫరెన్స్ కు హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రత్యేక అధికారి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ వర్షాల అనంతరం వ్యాధులు ప్రభలేందుకు అవకాశం ఉన్నందున పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని జిల్లా పంచాయతీ అధికారిని, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన మేరకు వివిధ రకాల నష్టం వివరాలను ఆదివారం మధ్యాహ్నం లోగా సమర్పించాలని సూచించారు.అదనపు కలెక్టర్లు జే. శ్రీనివాస్, టీ. పూర్ణచంద్ర, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు తదితరులు హాజరయ్యారు.