– సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
– తంగళ్ళపల్లిలో సర్వే విధానం పరిశీలన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం వివరాలు తప్పనిసరిగా సేకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎన్యుమరేటర్లకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సమగ్ర (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల)ఇంటింటి కుటుంబ సర్వేలో శనివారం ప్రారంభం కాగా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్ బ్లాక్ పరిధిలోని 0060, 0061/A/A లో అధికారులు, సిబ్బంది సర్వే చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే మొదలు పెట్టామని తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రొఫార్మా ప్రకారం అన్ని కుటుంబాల వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వేకు వచ్చే వారికి ప్రతి కుటుంబం వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమాచారం ప్రతి పథకానికి, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రణాళికలకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. సర్వే చేయనున్న గ్రామాలు, వార్డ్ ల సమాచారం స్థానికులకు ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, తహసిల్దార్ జయంత్ కుమార్, ఆర్ఐ దినేష్ పాల్గొన్నారు.