సీఐటీయూ నాయకులు, వీవోఏలపై పెట్టిన
కేసులు ఎత్తివేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు
నవతెలంగాణ- జోగిపేట
వీవోఏలు తన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం ఆపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జోగిపేటలో నిరవధిక సమ్మెను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అప్పటివరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన వారిని సీసీలుగా గుర్తించాలన్నారు. సెర్ఫ్ నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. వీవోఏలకు ఉద్యోగ భద్రత ముప్పు కలిగించే 58 జీవో సవరణ ఇతర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 38 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా 90 శాతానికిపైగా మహిళలు ఉన్న వీవోఏలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకుండా వాళ్లు శాంతియుతంగా చేస్తున్న పోరాటంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అరెస్టులు లాటి చార్జీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సమ్మె పట్ల మొండి వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్న మహిళ వీవోఏలు అని చూడకుండా పిడి గుద్దులు, అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి ఏం న్యాయమన్నారు. సమస్యలు పరిష్కరించాలని అడిగిన వారిపై కేసును బనయించడం సరికాదని వెంటనే కేసులు ఎత్తివేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుండా అదిరించి బెదిరించి నిర్బంధం ద్వారా ఉద్యమాలను ఆపాలని చూస్తే పోరాటం మరింత తీవ్ర చేస్తామని హెచ్చరించారు. ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించామని చెప్పుకునే కేసీఆర్ ఉద్యమాలను సహించలేని పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని చెబుతూనే న్యాయమైన సమస్యలు అడిగితే నిరంకుశంగా వ్యవరించడం భావ్యమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీఓఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేనిపక్షంలో సీఐటీయూ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి విద్యాసాగర్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య, మిషన్ భగీరథ యూనియన్ జిల్లా కార్యదర్శి రాములు, వివోఏలు లక్ష్మారెడ్డి, విజయ, రేణుక,సుప్రియ, చంద్రిక, అనిత, వీరమని, బి. అశోక్, స్వప్న, ఎం. అశోక్, లాయక్ అలి, భాగయ్య, లక్ష్మి, సువర్ణ సునీత, లక్ష్మణ్ మానస, అర్షియ తదితరులు పాల్గొన్నారు.