నాటకాలాడే కాలు… రోలు కింద పెట్టినా ఆగదంట. ఇప్పుడవే నాటకాలు రాష్ట్రంలో కొనసాగు తున్నాయి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ దీనికి మినహాయింపు కాదు. విధానాల పరంగా సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు… అడ్డదిడ్డంగా, వంకరటింకరగా మాట్లాడుతూ అసలు విషయాలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించటం వారి డొల్లతనానికి నిదర్శనం. గత నెలరోజులుగా, ఇంకా చెప్పాలంటే హైడ్రా అనే పేరు తెరమీదికొచ్చిన దగ్గర్నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నోళ్లకు హద్దే లేకుండా పోతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్ల పురాణాలతో మొదలైన ఈ ప్రహసనం… ఇప్పుడు సినీ రంగానికి చెందిన ఓ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితంపై ప్రభుత్వంలోని వారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం, దాంతో దుమారం చెలరేగటంతో పరాకాష్టకు చేరింది.ఈ వ్యాఖ్యలను సినీ తారలందరూ మూకుమ్మడిగా ఖండించటం, సదరు అగ్రనటుడు కోర్టుకెక్కి, మంత్రిపై పరువు నష్టం దావా వేయటం… ఇప్పటి వరకూ కొనసాగిన ఎపిసోడ్ల పరంపర. ఇదే సమయంలో కార్మికులు, రైతులు, కౌలుదార్ల వంటి వారి సమస్యలపై ఈ రెండు పార్టీలూ ఏ ఒక్క రోజూ మాట్లాడవు. ‘నువ్వు వెధవ అంటే నువ్వే వెధవ…’అనుకుంటూ ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకోవటం తప్ప ప్రజల విషయాలు వాటికి పట్టనే పట్టడం లేదు.
ఇది నాణేనికి ఒకవైపు. అదే నాణేనికి మరోవైపు తరచి చూస్తే, అనేక విషయాలు బోధపడక మానవు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రతిపక్ష బీఆర్‌ఎస్… ప్రతీ అంశాన్ని భూతద్దంలో చూపటం మొదలు పెట్టింది. ఫామ్‌హౌజ్‌లో కలిసిన సొంతపార్టీ నేతలతో ‘కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది, మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అవుతానంటూ’ ఆ పార్టీ బాస్ ఓదార్పు మాటలు చెప్పినా గులాబీ దళాలు హస్తం గూటికి చేరువవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా హస్తం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్‌ఎస్ నేతలు వాగ్బాణాలను ఎక్కుపెట్టారు. తద్వారా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కోల్పోయిన తమ ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవటానికి అప్పటి నుంచి ఇప్పటివరకు నానా తంటాలు పడుతున్నారు. ప్రతిపక్ష నేత మాత్రం కిమ్మనకుండా ఫామ్‌హౌస్‌లో కూర్చోవటం వింతల్లో పెద్ద వింత.
అధికారంలో ఉన్నవారు ఎంతో ఓపికతో, మరెంతో సహనంతో వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలంటారు మన పెద్దలు. ‘మాట’ల్లో ఆ ఓపికను, సహనాన్ని ప్రదర్శిస్తున్న అధికార పార్టీ.. చేతల్లో మాత్రం ‘తనపనితాను’ చేసుకుంటూ పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపుతామంటూ ప్రకటనలు గుప్పించిన సీఎం రేవంత్, మంత్రులు… ఆ తర్వాత వాటిని అమలు చేసి చూపటంలో ఇప్పటికీ కృతకృత్యులు కాలేకపోయారన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నిరాటంకంగా కొనసాగిన రైతు బంధు (రైతు భరోసా) నేటికీ అమలు కాకపోవటం అన్నదాతల్లో ఆవేదనను మిగిల్చింది. ఇక నిర్దిష్ట పద్ధతుల్లో నిర్ణీత సమయంలో అమలు చేయకపోవటంతో రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ సర్కారుకు అప్రదిష్టను మూటగట్టి పెట్టింది. ఆసరా పింఛన్ల పెంపు అటకెక్కిందనే గుసగుసలు వినబడుతుండగా, మహిళలు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు ఆర్థిక భరోసా అనేవి ఊసే లేకుండా పోయాయి. ఇవి ఇలా వెంటాడుతుండగానే గురుకులాల సమస్యలు, వైద్యారోగ్య శాఖలోని ఇక్కట్లు, సీజనల్ వ్యాధులు ముప్పిరిగొన్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్‌లాంటి పథకాలు ఎంతమందికి లబ్ది చేకూరుస్తున్నాయో చెప్పలేని పరిస్థితి. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల మీద శ్వేతపత్రాలు ప్రకటించిన సర్కారు… పథకాలు, కార్యక్రమాలు, హామీల మీద అదే రకమైన వైట్ పేపర్లు విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోగలదా? అనే సందేహం కలుగుతోంది. ప్రభుత్వంలోని ఏ ఒక్క మంత్రిగానీ, ప్రజా ప్రతినిధిగానీ ఇలా ంటి అంశాలపై విస్పష్టమైన ప్రకటనేదీ విడుదల చేయకపోవటం ప్రభుత్వ విధానపర లోపాలను ఎత్తి చూపుతోంది. హైడ్రా, మూసీ సుందరీకరణ విషయాల్లోనూ ఇదే రకమైన అస్పష్టత కొనసాగుతుండటం కొసమెరుపు.
ఇలాంటి విధానపర లోపాలకు, డొంక తిరుగుళ్లకు మూల కారణం ‘ఆర్థికమే’ అని చెప్పక తప్పదు. అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల గురించి తెలిసినా, హస్తం పార్టీ ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చింది. వాటిని అమలు చేయలేక ఇప్పుడు చతికిలపడుతోంది. ఆ క్రమంలో కక్కలేక, మింగలేక అన్నట్టు అసలు విషయాలను చెప్పలేక, వాటిని పక్కదోవ పట్టిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో విమర్శల పాలవుతున్న కాంగ్రెస్ సర్కారు… ఇకనైనా కండ్లు తెరవాలి.