దేవర రిలీజ్‌కి రెడీ

Devara is ready for releaseఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ను మంగళవారం మేకర్స్‌ ముంబైలో ఘనంగా నిర్వహించారు. నిర్మాత కరణ్‌ జోహార్‌, అనిల్‌ తడాని సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. 2 నిమిషాల 35 సెకన్లతో ఉన్న ఈ ట్రైలర్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్‌ అభిమానులకు, యాక్షన్‌ మూవీ లవర్స్‌ కోరుకునే అంశాలతో నిండి ఉంది. ఈ మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ క్రియేట్‌ చేసిన ప్రత్యేకమైన ప్రపంచం, ఆయన విజన్‌ అద్భుతంగా ఉన్నాయి. భైరాగా సైఫ్‌ అలీఖాన్‌, దేవరగా ఎన్టీఆర్‌, తంగం అనే పల్లెటూరి అమ్మాయిగా జాన్వీకపూర్‌తోపాటు ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, అజరు, గెటప్‌ శీను తదితరుల పాత్రల తీరు తెన్నులకు ఈ ట్రైలర్‌ అద్దం పట్టింది. ముఖ్యంగా భయానికి అర్థం చెప్పే పాత్రలో, భయపడుతూ ఉండే మరో పాత్రలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం హైలెట్‌గా నిలిచింది. ఈనెల 27న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు.