– నివేదికల చదివింపులతో సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
– అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
– పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రజా ప్రతినిధుల వినతి
నవతెలంగాణ-ఆమనగల్
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై మాట్లాడారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సభకు విన్నవించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ ఈ నెల చివరి వారంలో తమ పదవి కాలం ముగిస్తున్న సందర్భంగా తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించేలా కృషి చేయాలని, లేదా తమ పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడగించాలని ఎమ్మెల్యేను వారు వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. సర్పంచుల సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ ముంతాజ్ బేగం, సీఐ శివ ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.