యాదాద్రి తరహాలో భద్రాద్రి అభివృద్ధి

Development of Bhadradri along the lines of Yadadri– గెలిపిస్తే రామయ్య దర్శనం చేసుకుంటా..
– కాంగ్రెస్‌ చేతికి కత్తి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా..?
– గిరిజనేతరులకు పోడు పట్టాలివ్వాలనుకున్నా మోడీ అడ్డంకి కేసీఆర్‌తోనే సింగరేణికి పరిరక్షణ
– కొత్తగూడెం, భద్రాచలంలో కేటీఆర్‌ రోడ్‌ షో
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌/ కొత్తగూడెం
భద్రాద్రి రామయ్యను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారనడంలో వాస్తవం లేదని, రాముడుపై అపారమైన భక్తి ఉంది కనుకనే నా పేరు తారకరాముడిగా పెట్టారని, ఈ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావుని గెలిపిస్తే రామయ్యను దర్శనం చేసుకుంటానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. కాంగ్రెస్‌ చేతికి కత్తి ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే ఎలా, 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ ప్రాంతానికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ దివాళా కోరు విధానాలతో దేశం వెనకబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో భద్రాచలంలో తెల్లం వెంకట్రావుని గెలిపిస్తే భద్రాద్రిని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. భద్రాచలానికి కాంగ్రెస్‌ పార్టీ వల్లే పోలవరం శాపంగా మారిందన్నారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు.
కొత్తగూడెం పట్టణంలోని సూపర్‌ బజార్‌ సెంటర్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను పంటికి అంటకుండా మింగేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఈ కుట్రలు అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదని, సింగరేణి పరిరక్షణ కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ తెలంగాణకు గుండెకాయని, కార్మికులు, సంస్థను రక్షించుకునే బాధ్యత మాదేనన్నారు. సింగరేణిని లాభాల బాటలోకి తీసుకువచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వం అని తెలిపారు. ఓట్లు కొనేందుకు వస్తున్న బడాబాబులకు కొత్తగూడెం ప్రజల చైతన్యాన్ని రుచి చూపించాలని సూచించారు. సింగరేణి బతకాలంటే కేసీఆర్‌, వనమాకు ఓటు వేయాలని కార్మికులను కోరారు.
కార్యక్రమాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం, కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థులు తెల్లం వెంకటరావు, వనమా వెంకటేశ్వరావు, రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
దర్శనం చేసుకోకపోవడంపై చర్చ
భద్రాచలం ప్రజల ఓట్లను అడిగేందుకు ఎన్నికల ప్రచార నిమిత్తం భద్రాచలానికి వచ్చిన కేటీఆర్‌ భద్రాద్రి రామయ్యను దర్శించుకోకపోవడమేంటనే ప్రశ్న స్థానికంగా వ్యక్తమైంది. భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తేనే రామయ్య దర్శనానికి వస్తానని మాట్లాడటం సరికాదని విశ్లేషకుల అభిప్రాయం. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన రూ.100 కోట్లు, రూ.1000 కోట్ల హామీపై నోరు మెదపలేదు. కనీసం భద్రాచలం అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళిక కూడా ప్రకటించలేదు. దీనిపై విమర్శలు ఉన్న నేపథ్యంలోనే కేటీఆర్‌ వ్యవహారశైలి మరోసారి చర్చకు దారితీసింది.