‘భువనగిరి’ అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యం

'భువనగిరి' అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యం– రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌
నవ తెలంగాణ – జనగామ
భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ అన్నారు. జనగామ జిల్లా పసరమడ్ల గ్రామంలో గడ్డం ప్రభాకర్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో అబ్బాస్‌ మాట్లాడారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సీపీఐ(ఎం) నుంచి పోటీ చేస్తున్న ఎండీ జహంగీర్‌ గెలుపుకు పార్టీలోని ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ పాలకుల పుణ్యమా అని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని విమర్శించారు. పార్లమెంటులో వామపక్షాల బలం తగ్గడంతో బీజేపీ, కార్పొరేట్‌ శక్తులు పదేండ్ల నుంచి ప్రజా వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చి పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుంటున్నాయని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఎంతోమంది అమరవీరులు.. తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి పేదలకు 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని గుర్తు చేశారు. అంతటి చరిత్ర కలిగిన ఎర్ర జెండాను ఆదరించి ప్రశ్నించే గొంతును పార్లమెంటుకి పంపించి ప్రజా సమస్యల పరిష్కారానికి భువనగిరి పార్లమెంటు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇందుకు భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్‌, నాయకులు అన్యబోయిన రాజు, బెజ్జరమైన మల్లేశం, గంధమాల యాదగిరి, ఎర్రబోయిన కరుణాకర్‌, బెజ్జరమైన శ్రీను, బోయిని స్వాములు, బోయిని కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.