నవతెలంగాణ – ధర్మసాగర్
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ధర్మసాగర్ మండలం లోని ఇనుపరాతి గుట్టలను ఏకో టూరిజం,పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాని నేల గడుస్తున్న ఎలాంటి పనులు జరగక పోవడమే కాకుండా ఆ ప్రాంతం రైతులు మా భూములను వేరే వారికి ఎలా పట్టా చేశారని ఇది ఎలా సాధ్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు.హామీలకే పరిమితమైన ఇనుప రాతి గుట్టల అభివృద్ధి ఆలోచనలతో మండలంలో వేడెక్కుతున్న భూముల ధరలకు లెక్కలేస్తున్నాయని స్థానిక భూముల యజమానులు ఉవ్విర్లు ఊరుతున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.హనుమకొండ జిల్లాలో ఉన్న ఏకైక అటవీ ప్రాంతం ఇనుప రాతి గుట్టలు,పేరొందిన ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామస్తులు కొలిచే దేవుళ్ల గుడులు, ఏడాదంతా నిరంతరంగా పారే జలపాతాలు,పశుపక్ష్యాదుల ఆవాసాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తుంటారు. కానీ అవన్నీ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానిక రైతులు ప్రజలు అధికారులు అయోమయానికి గురవుతున్నా సందర్భాలున్నయ్యని చెప్పకనే చెప్పవచ్చు. రిజర్వ్‌ఫారెస్ట్ ప్రపోజల్ ఉన్నప్పటికీ అటవీ శాఖ ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కొందరు అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతున్నా సందర్భాలు ఉన్నాయని, ఇంకొందరు అటవీ భూములకు ఎసరు పెట్టి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విషయాలు వినిపిస్తున్నారు. కానీ ఎప్పటినుండో ఈ ప్రాంతంపై మైనింగ్ మాఫియా డేగ కన్నుగా కదలాడుతున్నారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
అయినప్పటికీ ఆఫీసర్లు మైనింగ్ కే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సమీప గ్రామస్తులు అయోమయానికి గురవుతూనే వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలో ఇనుప రాతి గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో 4,886.17 ఎకరాల మేర ఈ గుట్టలు వ్యాపించి ఉండగా, నిజాం కాలంలోనే దీన్ని అటవీ భూమిగా గుర్తించారు. వివిధ రకాల జంతుజాతులు, ఔషధ మొక్కలకు ఈ గుట్టలు పెట్టింది పేరు. జిల్లాలో ఉన్న ఏకైక అటవీ ప్రాంతం ఇదే కాగా ఇక్కడున్న అటవీ ప్రాంతం ఆఫీసర్ల లెక్కల ప్రకారం జిల్లాలో ఒక శాతం మాత్రమే. క్షేత్రస్థాయిలో ఉన్నది మాత్రం అంతకంటే తక్కువే. దీంతో ఈ ఏరియాను రిజర్వ్‌ఫారెస్ట్ ప్రకటించి,అటవీ సంరక్షణకు చర్యలు చేపట్టాలనే ప్రపోజల్ ఎప్పటినుంచో ఉన్నాయి. అయినా ఆ దిశగా చర్యలు తీసుకునేవారు కరవవడంతో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇటీవల 30 ఎకరాల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు జరగగా చివరి నిమిషంలో ఆఫీసర్లు అడ్డుకుని అక్కడ ప్లాంటేషన్ చేపట్టారు. ఇనుపరాతి గుట్టల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని గుట్టలకు సమీపంలోని దేవునూరు, దామెర, కొత్తపల్లి, ఎర్రబెల్లి, నరహరితండా, ముత్తారం తదితర గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవునూరు (ఇనుపరాతి) గుట్టలలో రోప్ వే, ట్రేకింగ్ మరియు క్యాంపింగ్, అలాగే హన్మకొండ హంటర్ రోడ్డులోని జూ పార్క్ ను, ధర్మసాగర్ బండ్ సుందరికరణ చేయాలని, రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుచేసి అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
గుట్టపై విలువైన నిక్షేపాలు ఉండటంతో కొందరు నేతల కన్ను దీనిపై పడిందని, ఇలా ఇదివరకు స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆఫీసర్ల అండతో పట్టా చేయించుకున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అక్రమంగా మట్టి, విలువైన రాయిని తీసుకెళ్లిన సందర్భాలు కోకోల్లోలుగా ఉన్నాయి. గతంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామస్తులందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉండగా కొంతమందికే తెలియజేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నామ్ కే వాస్తే అన్నట్టుగా అభిప్రాయాలు సేకరించి ఆ ల్యాండ్ ను మైనింగ్ కోసం అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు మేధావులు విశ్లేషకులు పేర్కొంటున్నారు.విశేషాలన్నీ ఇక మాయమే ఇప్పటికే ఇనుప రాతి గుట్టపై దామెర గ్రామం సమీపంలో మైనింగ్‌కు ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చేశారు. అది మాత్రమే కాకుండా ఎక్కడికక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో గుట్టమీద ఉండే ఎన్నో విశేషాలకు ముప్పు ఏర్పడుతోంది. ఈ గుట్టల్లో బలపాలొద్ది, తీగలొద్ది, జాలులాల అనే మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇవి ఏడాదంతా నిరంతరంగా పారుతూనే ఉంటాయి. ఈ నీటితో చుట్టుపక్కల ఉన్న దాదాపు 400 ఎకరాలు సాగవుతుంటాయి.
అంతేగాకుండా దేవునూరు గ్రామ సమీపంలోని జాలు పక్కనే దాదాపు ఆరేడు ఎకరాల్లో బటర్ ఫ్లై జోన్ కూడా ఉండి,అక్కడ రోజూ వివిధ రకాల సీతాకోకచిలుకలు సందడి చేస్తుంటాయని చెప్తూ ఉంటారు.గుట్ట మీద మునుల విగ్రహాల వద్ద ఏటా కార్తీక పౌర్ణమి రోజుల చుట్టుపక్కల ప్రజలు జాలు మల్లన్న జాతర కూడా నిర్వహిస్తుంటారు. వెనకటి కాలంలో ఇక్కడి ఒక ప్రాంతంలో ఏనుగులు ఆవాసం ఏర్పాటు చేసుకున్న ఏనుగుల మడుగు, నక్సల్స్ ప్రభావిత సమయంలో నిర్మించిన అమరవీరుల స్తూపం ఇలా ఎన్నో విశేషాలు ఈ గుట్టపై ఉన్నాయని,దీంతో ఇక్కడికి చుట్టుపక్కల ప్రజలు ఆహ్లాదం కోసం వచ్చి వెళ్తుంటారు స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఇన్నిప్రత్యేకతలున్న ఈ గుట్టలను టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేస్తామని కలెక్టర్‌గా ఆమ్రపాలి ఉన్న సమయంలోనే చెప్పారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్థానిక ఎంపీ కడియం కావ్యతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు మేధావులు రాజకీయవిశ్లేషకులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.