ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణం అభివృద్ధి: కేటీఆర్

నవతెలంగాణ -తాడ్వాయి
సీఎం కేసీఆర్ ఆశిర్వాదంతో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆద్వర్యంలో కామారెడ్డి పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీలో సుమారు 28 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభోత్సవాలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామం వద్ద నిర్మించిన స్వాగత తోరణాన్ని, సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ, మీడియన్ పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణానికి వచ్చే వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు అద్భుతంగా స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. సుమారు 28 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ, రోడ్డు మీడియన్, సెంట్రల్ లైటింగ్, 4 వరుసల రహదారిని అరు వరుసల రహదారిగా మార్చడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 25 కోట్ల రూపాయలను మంజూరు చేశారని,   పట్టణంలో పలు అభివృద్ది పనులకు మరో 20 కోట్ల రూపాయలను మున్సిపల్ నిధుల నుండి మంజూరు చేస్తునట్టు తెలిపారు. ఒకప్పుడు మున్సిపాలిటీ గా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడిందని, కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తుందని రానున్న రోజుల్లో అభివృద్ది కోసం మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్  పర్సన్ శోబా, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ తిర్మల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లు పాల్గొన్నారు.