హైదరాబాద్‌ అభివృద్ధితో రాష్ట్రాభివృద్ధి

Development of the state with the development of Hyderabad– పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌
– మూసీ నదిపై వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన
– రూ.545 కోట్లతో పలు చోట్ల 15 వంతెనలు
నవతెలంగాణ- నాగోల్‌/అంబర్‌పేట్‌/ ఉప్పల్‌
అత్యధిక ఆదాయ వనరులున్న హైదరాబాద్‌ మహా నగరాన్ని అభివృద్ధి పరుచుకుంటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతునందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మూసీ నదిపై వివిధ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో రూ.52 కోట్ల అంచనాతో నిర్మించనున్న ముసారాంబాగ్‌ బ్రిడ్జిని మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, బలాల శంకుస్థాపన చేశారు. నాగోల్‌లో ఫతుల్లా గూడ- పీర్జాదిగూడ మధ్య మూసీ నదిపై నాలుగు లేన్ల హైలెవల్‌ వంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ ఉప్పల్‌ భగాయత్‌ వద్ద మూసీ నదిపై వంతెన నిర్మాణానికి నగర మేయర్‌ విజయలక్ష్మి, హెచ్‌ఎండీఏ అధికారు లు, బీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.545 కోట్లతో మూసీ నదిపై నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 వంతెనలను నిర్మిస్తుందన్నారు. వీటిలో ఫతుల్లగూడ నుంచి పీర్జాధిగూడ వరకు రూ.52 కోట్లతో నూతన వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఈ వంతెనలు డిజైన్‌ అంశాలలో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని తెలిపారు. నగరంలోని దుర్గం చెరువు తర్వాత సినిమా షూటింగ్‌లకు ఈ వంతెనలు అత్యంత ఇష్టమైన ఎంపికగా నిలుస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాలని.. శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా బ్రిడ్జీల నిర్మాణం చేపడుతామన్నారు. దుర్గం చెరువు వద్ద 7 ఎంఎల్‌డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించామని తెలిపారు. ఎస్టీపీలు పూర్తయితే మూసీలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్థితి ఉంటుందన్నారు.
మంచిరేవుల నుంచి ఘట్‌కేసర్‌ వరకు మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కలను నెరవేరుస్తామని తెలిపారు. 160 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లే విధంగా బ్రిడ్జీలు నిర్మిస్తామన్నారు. రూ.5 వేల కోట్లతో రెండో విడుత ఎస్‌ఎన్‌డీపీ తొందరలోనే చేపడుతామని చెప్పారు. జీవో 118లోని చిన్న చిన్న టెక్నికల్‌ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకులకు, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, డిప్యూటీ మేయర్‌ మోత శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్‌ గుప్తా, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.