రూ.300 కోట్లతో వికారాబాద్‌ జిల్లా అభివృద్ధి

Development of Vikarabad district with Rs.300 crores–  ఆరు గ్యారంటీలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌
–  ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
వచ్చే ఐదేండ్లలో రూ.3000 కోట్లతో వికారాబాద్‌ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలిపారు. ఆరు గ్యారంటీలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంగళవారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధి 20వ వార్డు రాజీవ్‌ గృహకల్ప కాలనీలో నిర్వహించిన ప్రజా పాలన సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు అన్యాయం చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. జిల్లాలోని పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల రహదారులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, రోడ్ల నిర్మాణం కోసం రూ.300 కోట్ల నిధులను మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అనంతగిరి గుట్టను ఎకో టూరిజం కింద రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే కోటిపల్లి ప్రాజెక్టు వద్ద బోటింగ్‌ సదుపాయం కల్పించి యువతకు ఉపాధి కల్పించినట్టు తెలిపారు. వికారాబాద్‌లో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ తీసుకువచ్చి 4,000 మంది మహిళలకు, అలాగే పరిశ్రమలను స్థాపించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఒక్కటే దరఖాస్తుతో అన్ని గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రేషన్‌ కార్డుల కోసం తెల్ల కాగితంపై దరఖాస్తులు రాసి ఇవ్వాలని తెలిపారు. అన్ని పథకాలను ఇంటింటికీ అందించే పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికీ 6 గ్యారంటీలు అందే విధంగా ఒకే ఒక దరఖాస్తును సులువుగా రూపొందించినట్టు తెలిపారు. దరఖాస్తులో తప్పులు దొర్లకుండా నింపాలని సూచించారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని 97 వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల రమేష్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌ బేగం, వార్డు కౌన్సిలర్‌ మురళి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.