ఆకలి జిల్లాలో అభివృద్ధి పరుగులు

Development runs in the district of hunger– నీటి సామర్థ్యం లేని జూరాలతో సాగునీరు ఎలా సాధ్యం
– అభివద్ధికి సహకరించడమే కాదు బీఆర్‌ఎస్‌ను అధికారంలో నిలబెట్టండి : జడ్చర్ల, మేడ్చల్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
– ప్రతిపక్షాలవి అవగాహన లేని మాటలు
– హైదరాబాద్‌లో మరో లక్ష ‘డబుల్‌’ ఇండ్లు
నవతెలంగాణ-మేడ్చల్‌/ మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయం పాడుబడి తిండి గింజలు లేక ఆకలి చావులు జరిగే పాలమూరు.. అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకునే స్థాయి నుంచి పాలు గూరే జిల్లాగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్‌) అన్నారు. బుధవారం జడ్చర్ల, మేడ్చల్‌ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు పాలమూరు జిల్లాలో ఏ మూలకు వెళ్లినా పుట్టెడు ద్ణుఖంతో వలస బాట పట్టే వారే మనకు కనిపించేవారన్నారు. ఇప్పుడు దేశ నలుమూలల నుంచి పాలమూరు జిల్లాకు వలసలు వస్తున్న విషయం గుర్తించుకో వాలన్నారు. రాష్ట్ర ఏర్పాటులో
ప్రధాన భూమిక పోషించిన పాలమూరు కీర్తి చరిత్రలో శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. గతంలో తాను, జయశంకర్‌ కలిసి నారన్నపేట వెళ్లి వస్తుండగా ఆ ప్రాంత బీడు భూములు, ప్రజల బతుకులు చూసి కంట్లో నీళ్లు వచ్చాయన్నారు. నడిగడ్డ ప్రాంతమైన గద్వాల, అలంపూర్‌ పరిస్థితులు అలాగే ఉండేవన్నారు. తలాపున నీళ్లు ఉన్నా గుక్కెడు తాగునీళ్లకు నోచుకోని దయనీయ స్థితి నుంచి.. ఇప్పుడు మిషన్‌ భగీరథ తెచ్చి ఇంటింటికి తాగునీరు అందించామని గుర్తు చేశారు. కిడ్నీలు ఫెయిల్‌ అయిన వారు హైదరాబాద్‌కు వెళ్లకుండా ఇక్కడే డయాలసిస్‌ వసతి కల్పించామన్నారు. ఎగువల జూరాల ఉన్న మాట వాస్తవమే కానీ అందులో కేవలం 9 టీఎంసీలకు మించి నీళ్లు నిలువ ఉండవన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అవసరమైన 120 టీఎంసీల నీళ్లు అందాలంటే అది శ్రీశైలం ద్వారానే సాధ్యమని గుర్తు చేశారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా నేనే డిజైన్‌ చేసి పాలమూరు-రంగారెడ్డిని రూపొందించానన్నారు. ఇక పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, పాలమూరు-రంగారెడ్డి, పోతన పథకాలను పూర్తి చేసుకోవడం ద్వారా బంగారు పంటలు పండుతాయన్నారు. అంతేకాదు, హైదారబాద్‌కు సమీపంలో ఉన్న జడ్చర్లను ఐటీ హబ్‌, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు. మరోసారి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, బాప్కారి శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, శాంత కుమారి, రజిని, చెల్లా వెంకటరామిరెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సమైక్య పాలనలో అరిగోసలు పడ్డ తెలంగాణ.. నేడు స్వరాష్ట్ర పాలనలో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారిందని చెప్పారు. ఆనాడు తెలంగాణలో కరెంట్‌, మంచినీరు లేదని, అడుగడుగునా వివక్షకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రాలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అహంకారపూరితంగా.. తెలంగాణ కు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోవాలని అంటే.. కాంగ్రెస్‌ నాయకులు నోరెత్తలేదని గుర్తు చేశారు. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా మారిందన్నారు. మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్బీ నగర్‌, ఉప్పల్‌ ఓ మినీ భారతమనీ, ఇక్కడికి ఎంతో మంది పొట్ట చేత పట్టుకుని వస్తారన్నారు. హైదరాబాద్‌కు వచ్చే వారు ఎక్కువగా ఇక్కడే స్థిరపడుతున్నారని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్‌ చేర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఒక్క మేడ్చల్‌ నియోజకవర్గానికే 26వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం అందిస్తామన్నారు. పింఛన్లను దశల వారీగా పెంచుతామన్నారు. మల్లారెడ్డి లాంటి సమర్థవంతమైన నేత మేడ్చల్‌కు కీలకమని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ ప్రజలను కాల్చి చంపిన నాయకులకు అధికారం ఇస్తారా అని ప్రశ్నించారు. కాగా, సీఎం సభకు ఆలస్యంగా చేరుకోవడంతో పాటు చీకటి పడుతుండటంతో చాలామంది వెనుదిరిగి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభిపూర్‌ రాజు, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్య గారి నవీన్‌ కుమార్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌, మేయర్లు, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మహేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.