అభివృద్ధి..సంక్షేమమే ముఖ్యం

 Adilabad– ఆరు గ్యారంటీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నాం
– రుణమాఫీతో 55,879మంది రైతులకు ప్రయోజనం
– సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాం
– ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ
– జిల్లాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రథమ ప్రాధాన్యమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. ముఖ్యమంత్రి దార్శనిక పాలనలో విద్యుత్‌, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన తదితర అన్ని రంగాలను అభివృద్ధి పథకంలో దూసుకెళ్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా మంగళవార ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్‌ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని హైదరాబాదు సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రోజును పురస్కరించుకొని ప్రజాపాలన వేడుకలను నిర్వహించుకుంటున్నామని వివరించారు.
ఆరు గ్యారెంటీలు అమలు
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఆరు గ్యారంటీలను నిక్కచ్చిగా అమలు చేసి తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నాయని చెప్పారు. అర్హులైన అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో మహాలక్ష్మి, గృహాజ్యోతి, యువ వికాసం, చేయూత, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి అభయహస్తం గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించామన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే ఆరు గ్యారంటీలలో రెండు హామీలను అమలు చేసి ప్రజల పట్ల తమకు గల అంకితభావాన్ని చాటుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జిల్లాలోని ఇంద్రవెల్లి, కేస్లాపూర్‌లలో ఫిబ్రవరి 2న పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారని గుర్తుచేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం అభివృద్ధి పనులకు రూ.కోటి, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను రూ.6 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ గ్రామంలోని 15 మంది అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించడం జరిగిందని తెలిపారు.
పథకాల ద్వారా ప్రయోజనం
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇప్టపి వరకు 93,63,017మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని ఆహార భద్రత కార్డు కలిగిన వారికి రూ.500 గ్యాస్‌ సబ్సిడీ కింద 96,115మంది వినియోగించుకుంటున్నారని చెప్పారు. గృహజ్యోతిలో భాగంగ 95,037మంది ఉచిత విద్యుత్తును వినియోగిస్తున్నారని చేయూత కింద రూ.10లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మూడు విడతల్లో రుణమాఫీతో జిల్లాలో ఇప్పటి వరకు 55,879మంది రైతులకు రూ.608.55కోట్లు జమ చేసినట్లు వివరించారు. వ్యవసాయానికి 24 గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రా కింద రాబోయే ఐదేండ్లలో స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ఇందుకు గాను ఇప్పటికే వారికి రుణాలు అందించి యూనిట్లు నెలకొల్పుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెన్‌గంగా, చనక-కోర్ట బ్యారేజీ, సాత్నాల, మత్తడివాగు, పులిమడుగు, చిక్‌మాన్‌, త్రివేణి సంగమం, కుప్టి ప్రాజెక్టులకు నిధులు మంజూరుచేశామని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోడ్ల, భవనాలశాఖ ద్వారా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, తాంసి బస్టాండ్‌ వద్ద అండర్‌ బ్రిడ్జిల కోసం రూ.97.20కోట్లు మంజూరుచేశామని, ఇచ్చోడలో నాలుగు వరుసల రహదారి కోసం రూ.9కోట్లు మంజూరుచేసినట్లు చెప్పారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి గిరిజనుల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి, జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ గౌస్‌ ఆలం, అదనపు కలెక్టర్‌ శ్యామలదేవీ తదితరులు పాల్గొన్నారు.