అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

– ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి అన్నారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, మన ఊరు మనబడి పనులపై ఇంజనీరింగ్‌, విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల నిర్దేశిత లక్ష్యాన్ని త్వరితగతిన సాధించే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లాలో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు దృష్టి సారించాలని, ఉప కేంద్రాల భవనాలు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యాలయాల పనులు, మరమ్మతులను పూర్తి చేయాలని, అంగన్వాడి భవనాలలో అవసరమైన మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. కొలాం ఆవాస ప్రాంతాలలో మంజూరైన అంగన్వాడి భవనాల నిర్మాణ పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా సిద్ధం చేయాలని తెలిపారు. పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తులు, తాగునీరు, మూత్రశాలలు, డ్యూయల్‌ బెంచీలు ఇతర పనులను పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌, సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, ఈఈలు, డిఈలు, ఇంజనీరింగ్‌ అధికారులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.