– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
నవతెలంగాణ-కోడంగల్
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కాడ కింద మంజూరైన నిధులతో పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కొడంగల్ కాడ కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులపై నారాయణపేట్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు. మంజూరైన పనులకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులకు ప్రారంభించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రోడ్ల విస్తరణ, రోడ్ల బలోపేతంకు సంబంధించి పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి శాఖల ఇంజనీయర్లు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. వివిధ కాలేజీల నిర్మాణం నిమిత్తం భూసేకరణ చేపట్టాలని, భూసేకరణ విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. కొడంగల్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల భవనాల నిర్మాణాల నమూనాలు, వైద్యుల నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. నీటి ట్యాంకుల నిర్మాణాలకు, పైపులైన్ల పనుల నిమిత్తం అవసరమైన నిధుల నిమిత్తం ప్రతిపాదన పంపాలని కలెక్టర్ తెలిపారు. కాడ కింద నియోజకవర్గంలో మంజూరైన చెక్ డ్యాంల నిర్మాణ పనులపై , అటవీ శాఖ భూముల్లో జరుగుతున్న పనులపై కలెక్టర్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లలో ఎక్కడ గుంతలు ఉండరాదని, ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని, ప్రతి వారం నిర్వహించే సమీక్షలో పురోగతి ఉండాలని, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన గురుకుల పాఠశాలలు స్థానికంగా ఉండే విధంగా వసతి గహాల నిర్మాణాలకై స్థల సేకరణ చేపట్టి వివిధ సంక్షేమ శాఖలకు కేటాయించాలని సూచించారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఆస్పత్రిలోని ప్రతి వార్డులను పరిశీలించి అక్కడి పరిస్థితులను రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఎంత మంది డాక్టర్‌లు, అంబులెన్సులు ఎన్ని ఉన్నాయని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పెషేంట్లకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, డీసీఎచ్‌ఎస్ ప్రదీప్, డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.