అభివృద్ధి -అధిక సంతానం!

Development - more offspring!ఆ రోజు ఆదివారం. పుష్కకుమార్‌ నిదానంగా పదిగంటలకు నిద్రలేచాడు. అన్నీ ముగించుకుని శ్రీమతి అందించిన కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్నాడు. ముందున్న పేపర్‌ అందుకుని సగం చదివాక తన ముద్దుల కొడుకు ఐదేండ్ల చంటిగాడు తనకు కనబడలేదన్న విషయం గుర్తుకొచ్చింది.
”వందనా! చంటిగాడేడి!” అన్నాడు పుష్పకుమార్‌. ”రాత్రి, మీ సుపుత్రుడికేదో హితబోధ చేశారు కదా! నాన్న చెప్పినట్టే చేస్తానమ్మా! అంటూ పొద్దుటే బయటికి వెళ్లాడు!” అన్నది వందన వంటింట్లోంచి.
పుష్పకుమార్‌ ఆనందానికి అవధులు లేవు! తన సుపుత్రుడు తన మాట, కాదు తన ఆజ్ఞలు అమలు చేయటానికి ఆదివారం క్రికెట్‌ ఆడటం మానేసి వెళ్లాడు. చంటిగాడు రాముడంతటి వాడు! జైశ్రీరాం అనుకున్నాడు మనసులో. అయితే తానేమి ఆజ్ఞ ఇచ్చాడో ఎంత ప్రయత్నించినా గుర్తుకురాలేదు. చంటిగాడు వచ్చాక ఆడుగుదామని అనుకుంటూ పేపరు చదవటం మొదలెట్టాడు. ఇంతలో ధడాలున గేటు చప్పుడైంది. సినిమాలో విలన్‌ ఇంటి గేటు తోసుకుని హీరో వచ్చినట్టు చంటిగాడు వచ్చాడు.
చంటిగాడిని చూడగానే పుష్పకుమార్‌ ఛాతి 55 ఇంచుల వరకు పెరిగి ఆగిపోయింది! గర్వంగా చంటిగాడిని ఎత్తుకోబోయాడు. కాని చంటిగాడు తండ్రిని దులిపేశాడు.
”నీవు వెళ్లిన పని ఏమైంది చంటి!” అన్నాడు పుష్పకుమార్‌.
”నేను మూడు ఆఫీసులకి వెళ్లాను! అందరూ వెక్కిరించారు! ఇంత చిన్న వయసులో ఇదేం బుద్ధి అంటున్నారు! అంతా నీవల్లే!” గుర్రుమన్నాడు చంటిగాడు.
”ఆఫీసులకి ఎందుకెళ్లావు! ఎందుకు వెక్కిరించారు! నేనేం చేశాను!”అన్నాడు పుష్పకుమార్‌ ఆయోమయంగా.
”ఎంతమంది ఎక్కువ పిల్లల్నికంటే దేశానికి అంత మంచిదని పెద్దాయన చెప్పాడని, దాన్ని మనమంతా అమలు చేయాలని, నీవు తప్పక అమలు చేయాలని, రాత్రి నాకు చెప్పావు కదా! అపుడే మర్చిపోయావా?” చిరాగ్గా అన్నాడు చంటిగాడు.
”అవును చెప్పాను! పెద్దాయన మాటలు తప్పక అమలుచేయాల్సిందే! అయితే ఏమయ్యింది.?” అన్నాడు పుష్పకుమార్‌.
”పెద్దాయన మాటలు అమలు చేయాలంటే నాకు పెండ్లికావాలి కదా! అందుకే పొద్దున్నే లేచి మాట్రిమోనీ ఆఫీసులకు వెళ్లి నాకు సంబంధాలు చూడమంటే, అక్కడ వాళ్లు నన్ను వెక్కిరిస్తున్నారు. నేను పెద్దాయన మాటలు అమలు చేయాలని ప్రయత్నించడం తప్పా” అన్నాడు చంటిగాడు.
పుష్పకుమార్‌కి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థంకాలేదు.
”నీకింకా పెండ్లి వయసు రాలేదురా!” అన్నాడు ఎలాగోలా.
”మరి నీకు పెండ్లి అయ్యిందిగా నన్ను ఒక్కడ్ని ఎందుకు కన్నారు?” ప్రశ్నించాడు చంటిగాడు.
”అపుడు పెద్దాయన ఈ మాట చెప్పలేదు! అందుకే నిన్ను ఒక్కడ్నే కన్నాము!” అన్నాడు పుష్పకుమార్‌.
”ఇపుడు చెప్పాడు కదా! ఇంకో ముగ్గుర్ని కనండి!” అన్నాడు చంటి.
‘ఇపుడు మీ అమ్మకి పిల్లలు పుట్టరుగా!’ అన్నాడు పుష్పకుమార్‌.
”అయితే నీవు ఇంకో పెండ్లి చేసుకుని ముగ్గురిని కని, పెద్దాయన మాటలు అమలు చేయాల్సిందే!” పంతంగా అన్నాడు చంటిగాడు.
చంటిగాడి మాటలకు ఆలోచనలో పడ్డాడు పుష్పకుమార్‌. తాను క్రమశిక్షణ గలవాడు. పరివార్‌ సభలకు, సమావేశాలకు క్రమం తప్పక హాజరై, అక్కడ చెప్పివన్నీ తూ.చా. తప్పకుండా అమలు చేస్తాడు. ఈ మధ్య వాట్సాప్‌లో వచ్చే సందేశాలు కూడా అమలు చేస్తున్నాడు. విస్తృతంగా ఆ సందేశాలు ఇతర గ్రూపులకు పంపిస్తుంటాడు. తన కొడుకు కూడా తనను మించిన ప్రచారకుడిగా ఎదగాలని పుష్పకుమార్‌ బలమైన కోరిక. చూస్తుంటే ఈ కోరిక చాలా తొందరగా తీరినట్లే కన్పిస్తోంది! పుష్పకుమార్‌ ఈ ఆలోచనల్లో ఉండి, కండ్లముందేమి జరుగుతుందో పరిశీలించలేదు.
చంటిగాడి మాటలకు కోపం వచ్చిన వందన వంటింట్లోంచి దూసుకొచ్చి చంటిగాడి ఎడమచెంప పెళ్లుమని వాయించింది.ఆ శబ్దానికి పుష్పకుమార్‌ ఈ లోకంలోకి వచ్చాడు. వందన చేయి వంద కిలోమీటర్ల వేగంతో చంటిగాడి కుడి చెంపవైపు దూసుకొస్తోంది. ప్రమాదాన్ని గుర్తించి పుత్రరత్నాన్ని లాక్కుని, వాడిని వాడి చెంపను రక్షించాడు.
”ఎందుకు వాడిని కొడుతున్నావు?” కోపంతో అన్నాడు పుష్పకుమార్‌.
”వాడేం మాట్లాడుతున్నాడో మీకేమైనా అర్థమైందా?” విసురుగా అన్నది వందన.
”ఆఁ చాలా బాగా అర్థమైంది! నాకు కర్తవ్యబోధ చేశాడు!” అన్నాడు చంటిగాడిని ఆరాధనగా చూస్తూ పుష్పకుమార్‌.
”మీరేం మాట్లాడుకున్నారో నాకు అర్థం కావటంలేదు!” అన్నది వందన.
”ఇందులో అర్థం కానంత బ్రహ్మవిద్య ఏమీ లేదు! ఎక్కువమంది పిల్లలను కని, జాతిని, మతాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయాలని పెద్దాయన చెప్పాడు! అది అమలుచేయటానికి చంటిగాడికి వయసు లేదు! మనకు మరింత మంది పిల్లలు పుట్టడానికి నీకు చేసిన ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ అడ్డంకి! అందుకే రెండోపెండ్లి చేసుకోమని నా కొడుకు నాకు కర్తవ్యబోధ చేస్తున్నాడు. నా సిద్ధాంతాలను నా కొడుకు ఎంతబాగా అర్థం చేసుకున్నాడో చూడు! అర్థం చేసుకోవడమే కాదు! అమలు చేయడానికి ఎంత ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నాడో చూడు!” అన్నాడు పుష్పకుమార్‌ మురిపెంగా.
”అయితే ఏమిటి?” అన్నది వందన
”ఇంకేముంది! రెండోపెండ్లి చేసుకోవటమే! ఇంతకు ముందు నా కొడుకు వెళ్లివచ్చిన మాట్రిమోనీ ఆఫీసులకు ఇప్పుడు నేను వెళ్లి, నా ఫొటో, డీటేయిల్స్‌ ఇచ్చి వస్తాను!” అన్నాడు పుష్పకుమార్‌ హుషారుగా.
”మరి నా సంగతీ!’ అడిగింది వందన.
”ఎంచక్కా నాకు, నా కొత్త భార్యకు ముగ్గురు పిల్లలు పుట్టేంతవరకు, మాకు వండిపెట్టి, నా కొడుకును స్కూలుకు పంపుతూ, కృష్ణా!రామా! అనుకుంటూ వంటిల్లు జాగ్రత్తగా చూసుకో!” అన్నాడు మరింత హుషారుగా.
”కృష్ణ, రామా! అనుకునేంత వయస్సు నాకేమీ రాలేదుగానీ, మీఆలోచన ఏమీ మారదా?” అన్నది వందన.
”మారదు! మారబోదు! పెద్దాయన మాటే శిలాశాసనం! మేమంతా పాటించి తీరుతాం! అందుకు తిరుగులేదు!” అన్నాడు పుష్పకుమార్‌! దృఢమైన పట్టుదలతో పిడికిలి బిగింది.
”అయితే నా మాట వినండి! తర్వాత మీ పెద్దాయన శాసనాలు అమలు చేద్దురు గానీ!” అంటూ ఫోన్‌ తీసింది వందన.
”ఏంటీ ఫోను చేస్తున్నావు! పోలీసులకు ఫోను చేస్తావా? లేక లాయరుకు ఫోను చేస్తావా?” అంటూ పుష్పకుమార్‌ పగలబడి నవ్వాడు.
”చట్టం, న్యాయాలను మీరు జేబులో పెట్టుకున్నారని నాకుతెలుసు, అందుకే డాక్టర్‌కి ఫోను చేస్తున్నాను”అన్నది వందన.
”డాక్టర్‌కి ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు పుష్పకుమార్‌.
”నాడు మీరు చేయించిన ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ను డాక్టర్‌తో రివర్స్‌ చేయించుకుంటాను. కాలేజీలో నన్ను ప్రేమించి, నేను కాదన్నందుకు ఇంకా బ్రహ్మచారిగా మిగిలిపోయి, ఆసుపత్రి పెట్టి, పేదలకు ఉచిత వైద్యం చేస్తున్న ఆదర్శమూర్తి ఆ డాక్టర్‌. మీరు బుద్ధిమంతుడని చెబితే నమ్మి మిమ్మల్ని పెండ్లి చేసుకున్న అప్పుడు. ఆ ఆదర్శమూర్తిని పెండ్లి చేసుకుని సరిదిద్దుకుంటాను. అన్నట్లు మేము ఇక పిల్లలను కనం. ఈ చంటి వెధవకి ఇంకనైనా బుద్ధివస్తే, వీడిని తన కొడుకుగా చూసుకోగల సంస్కారం ఆయనకు ఉంది!” అంటూ వందన ముందుకు కదిలింది! చంటిగాడు ఏడుస్తూ, తండ్రి చేయి విదిలించుకుని తల్లిచేయి అందుకుని నడిచాడు.
పుష్పకుమార్‌ బుర్ర గిర్రున తిరిగి ఎప్పుడో కిందపడిపోయాడు.
– ఉషాకిరణ్‌