మేడారంకు పోటెత్తిన భక్తజనం.. 

– వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
– క్యూలైన్ల ద్వారా దర్శనం
– వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
నవతెలంగాణ- తాడ్వాయి
2024 మేడారం మహాజాతరకు ఇంకా సుమారు నెల సమయం ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మహాజాతర తేదీలను ఖరారు చేశారు. కానీ భక్తజనం మాత్రం ముందే లక్షలాదిగా మేడారంకు తరలి వస్తున్నారు. నేడు ఆదివారం సెలవు దినం కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు మేడారంకు క్యూ కట్టారు. సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు ఆదివారం ఒక్కరోజే సుమారు రెండు లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి సమ్మక్క-సారక్క దేవతలు దర్శించుకుంటున్నారు. సమ్మక్క-సారక్క దేవతలకు ప్రీతికరమైన నిలువెత్తు బెల్లం మొక్కులు సమర్పిస్తున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు దగ్గరుండి దర్శనాలు చేస్తున్నారు.
క్యూలైన్ల ద్వారా దర్శనం
మేడారంలో వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తడంతో పూజార్లు, ఎండోమెంట్, పోలీస్ అధికారులు క్యూలైన్ల ద్వారా దర్శనాలు చేస్తున్నారు. దర్శనానికి వెళ్లేటప్పుడు తొక్కిసలాట జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్ల ద్వారా విభక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకొని వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు.
వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ శాఖల ప్రముఖులు ఆదివారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, బయ్యారం సిఐ శివప్రసాద్ అశ్వాపురం సిఐ గద్ద రవీందర్ లు, సెంట్రల్ డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ రామ్ కిషన్, హైకోర్టు రిజిస్టార్ శ్యాం కుమార్ తదితరులు వనదేవతలను దర్శించుకున్నారు.