మేడారంలో పోటెత్తిన భక్తజనం 

– ముందస్తుగా భారీ మొక్కులు
– భారీగా ట్రాఫిక్ జాం
– వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
నవతెలంగాణ -తాడ్వాయి : మేడారంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. మేడారంలోని పరిసరాలు మహా జాతరగా తలపించాయి.  సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో  కుటుంబ సమేతంగా వాహనాలు,బస్సుల్లో మేడారానికి తరలిరావడంతో నిండు జాతరను తలపించింది. మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగువద్ద తలనీలాలు సమర్పించుకొని, జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. మేడారానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చతిస్గడ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, మధ్యప్ర దేశ్ రాష్ట్రాల నుండి  భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తుల దర్శనంతో మేడారం గద్దెల ప్రాంగణం,ఐలాండ్ తదితర ప్రాంతాలు  సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారు మోగిపోతుంది. భక్తుల రద్దీ వల్ల తల్లుల దర్శనానికి గద్దెల లోపటికి ప్రవేశాన్ని నిలిపివేయడంతో భక్తులు బయటినుంచే తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సమ్మక్క సారలమ్మ  గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది
తాడ్వాయి నుండి మేడారం జాతరకు వెళ్లే వాహనాలు రెండు  గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో  పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో భక్తుల ఇబ్బందులు తొలగిపోయాయి.
వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
ఆదివారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ మనదేవతలను ప్రముఖులు దర్శించుకున్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, బ్యాట్మెంటన్ శ్రీకాంత్, అస్సెట్ సెషన్ జడ్జి హైదరాబాద్ మాధవి లు వనదేవతలను దర్శించుకున్నారు. పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు రానా రమేష్ యూత్ అధ్యక్షుడు సిద్ధబోయిన భోజారావు లు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సారా సమర్పించి ప్రత్యేక ముక్కలు చెల్లించారు. అనంతరం వీరికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి వనదేవతల ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో పూజారులు, మేడారం అభ్యుదయ యువజన సంఘం నాయకులు, ఎండోమెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.