జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి మొత్తం 90 స్థానాలకు వచ్చే నెల 18 నుంచి మూడు దశల్లో అక్కడ శాసనసభా సమరం జరగనుంది. హర్యానాలోనూ అవే 90 స్థానాలకు మాత్రం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అసలు ఎన్నికలు నిర్వహించేదే రెండే రాష్ట్రాల్లోనే అయినప్పుడు ఒక్క జమ్మూకశ్మీర్‌లో మూడు విడతల పోలింగ్ నిర్వహించడంలో అంతర్యం ఏమిటి? వాస్తవానికి ఈ ఏడాది నవంబరులో మహారాష్ట్రతోపాటు హర్యానా ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరిలో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. జమ్మూకశ్మీర్‌లో భారీస్థాయిలో బలగాలను మోహరించాల్సిన అవసరం ఉన్నందున మహారాష్ట్రను పక్కనబెట్టారట. అంతే కాదంట మహారాష్ట్రలో వినాయకచవితి, నవరాత్రులు, దీపావళి వంటి పండుగలున్నా యని, ఓటర్ జాబితాను అప్డేట్ చేయడానికి వర్షాలు అడ్డుపడ్డాయి అంటూ అనేక కారణాలు చెప్పుకొచ్చారు సీఈసీ రాజీవ్‌కుమార్. మరి, జార్ఖండ్‌ను ఢిల్లీతో కలిపి జరుపుతామనడంలోని లోగుట్టు పెరుమాళ్లుకే ఎరుక కావాలి.
ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపు తరవాత జమ్మూకశ్మీర్ జీడీపీ గణనీయంగా పెరిగిందని, ఉగ్రదాడులు తగ్గిపోయాయని అధికారగణం సెలవిస్తోంది. శాంతిభద్రతల పరంగా అక్కడ కొత్తయుగం ఆరంభ మైందనీ ఊదరగొడుతోంది. కశ్మీరం సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం రూ.80వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అయినా ఎందుకో వారిని అభద్రతాభావం వెంటాడుతోంది. అందుకే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సైతం కశ్మీర్ లోయలోని స్థానాలకు పోటీచేసే సాహసమే బీజేపీ చేయలేకపోయింది. జమ్మూకశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని ఎత్తివేసి, రాష్ట్రంగా ఉన్న దాన్ని కేంద్రపాలితంగా మార్చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టకుండా, ఎన్నికలు మాత్రం ఈ ఏడాది సెప్టెంబరు ముప్పైలోగా జరగాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. వాస్తవానికి అక్కడి పార్టీలు, ప్రజలు ఎంతోకాలంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తమ శంఖులో పోసి అదే తీర్థమన్నట్టు చెప్పుకొచ్చారు.
2014లో రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన చివరి ఎన్నికల్లో ముఫ్తీమహ్మద్ సయీద్ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అతిపెద్దపార్టీగా అవతరించింది. బీజేపీ-పీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయన మరణానం తరం 2016లో కుమార్తె మహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. ఆ సంకీర్ణ సర్కారు ముచ్చట మూన్నాళ్ల చందమే అయ్యింది. 2018లో ప్రభుత్వం కూలిపోయి, గవర్నర్ పాలన మొదలైంది. మరుసటి ఏడాది ఆగస్టులో కేంద్రప్రభుత్వం 370 ప్రయోగించింది. ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఎన్నికల సంఘం ప్రకటనకు ఒకరోజు ముందే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చర్యలపై వచ్చిన అభ్యంతరాలను ఇదే ఎన్నికల సంఘం తేలికగా కొట్టిపారేసింది. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న ప్రతీ చర్యకు ఈ ఎన్నికల్లో ప్రజలు సమాధానం చెబుతారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు పాలకులు చెప్పిన కారణాలను చూపెట్టి వారి ఆకాంక్షలు ఏమేరకు నెరవేరాయో బేరీజు వేసుకుంటారనడంలో సందేహం లేదు.
అయినా హర్యానా శాసనసభకు నవంబర్ మూడున కొత్త శాసనసభ ఏర్పడేలా కాకుండా రెండు నెలలకు పైగా ముందుకు లాగారు. అదేసూత్రం మహారాష్ట్రకు ఎందుకు వర్తింప చేయలేదో తెలియదు. అదేమంటే ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్థారిస్తుంది అంటారు. కానీ ఎన్నికల కమిషన్ ప్రభుభక్తి చాటుకునే పనిలో ఉన్నదన్న విషయం జగమెరిగిన సత్యం. అంతా అధికార పార్టీ కనుసన్నల లోనే జరుగుతుందనేది కూడా ఎవరూ కాదనలేని పచ్చి నిజం. అందుకే ఉత్తరప్రదేశ్ పది శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. కానీ ఆ షెడ్యూలు ఇంకా ప్రకటించలేదు.
90 స్థానాలున్న హర్యానాలో ఈ మారు కాంగ్రెస్‌ది పైచేయి అవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019లో మెజారిటీ లేకున్నా దుష్యంత్ చౌతాలాతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఖట్టర్ కొనసాగగలిగారు. కానీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ఆ కూటమి కూలింది, ఖట్టర్ స్థానంలోకి నయాబ్‌సింగ్ సైనీ వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సగం స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పట్ల ప్రజాదరణ పెరిగిందని సర్వేలు కూడా అంటున్నాయి. నిరు ద్యోగం, అగ్నివీర్, రైతు ఉద్యమాలు, మహిళా రెజ్లర్ల అంశం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయి. యూపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను కాపాడుకోవడంకోసం బీజేపీ పెద్దలు మహిళా రెజ్లర్లతో అన్యాయంగా వ్యవహరిం చారన్న ఆగ్రహం ఖాప్ పంచాయితీల్లో వెల్లడవుతోంది. ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన వినేశ్ ఫోగట్మీద ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడ టమూ ఓటర్లమీద పనిచేయవచ్చు. జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల్లో స్థానికాంశాలే ప్రధానంగా పనిచేసినప్పటికీ, ఫలితాల ప్రభావం అన్నింటా ఉంటుంది.