ములుగులో మావోయిస్టుల కదలికలపై డీజీపీ ఆరా

ములుగులో మావోయిస్టుల
కదలికలపై డీజీపీ ఆరానవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ఉత్తర తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు సాగుతున్నాయనే సమాచారంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ములుగులో మావోయిస్టు లోకల్‌ ఘెరిల్లా స్క్వాడ్‌ (ఎల్‌జీఎస్‌) ఒకటి సంచరిస్తున్నదనే సమాచారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ సోమవారం ఆరా తీశారు. మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి సరిహద్దులను దాటి ములుగులోకి వీరు ప్రవేశించారనే కోణంలో యాంటీ నక్సలైట్‌ విభాగం అధికారులు నిశితంగా దృష్టిని సారించి గాలింపు చర్యలను ఉధృతం చేసినట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార పర్వం చివరి అంకంలో ఉండటం, వివిధ పార్టీల రాజకీయ నాయకులు విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తుండటంతో దీనిని ఆసరాగా చేసుకొని మావోయిస్టులు ఏదేనీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదమున్నదని ఇంటెలిజెన్స్‌ విభాగం సైతం హెచ్చరించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ములుగు సరిహద్దుల్లో గాలింపు చర్యలను ఉధృతం చేయాలని గ్రేహౌండ్స్‌ బలగాలను డీజీపీ ఆదేశించినట్టు సమాచారం. అదే సమయంలో రాజకీయ ప్రముఖుల భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కూడా డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది.
నగర కమిషనర్‌కు స్వల్ప అస్వస్థత
హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య సోమవారం స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన తన కార్యాలయంలో అధికారులకు ఎన్నికల బందోబస్తుకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా కళ్లు తిరిగినట్టై కుర్చీలో కూర్చున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు డాక్టర్లను పిలిచి పరిశీలించగా ఆయన లోబీపీకి గురైనట్టు తేలింది. దాంతో ఆయనను స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరిపాక కొంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అనంతరం ఆయన తన నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నికల విధి నిర్వహణ కోసం ఇటీవలనే కేంద్ర ఎన్నికల కమిషన్‌ సందీప్‌ శాండిల్యను నగర పోలీసు కమిషనర్‌గా నియమించి ఆ స్థానంలో ఉన్న సి.వి ఆనంద్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, తాను మంగళవారం విధులకు హాజరవుతాననీ సందీప్‌ శాండిల్య తోటి అధికారులకు తెలిపారు.