ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర రైల్వే భద్రతపై డీజీపీ సమీక్ష

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో రైల్వే భద్రతపై ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ రవి గుప్తా సమీక్షించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, రాష్ట్ర రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌, రాష్ట్ర రైల్వే సెక్యూరిటీ విభాగం ఐజీ ఠాకూర్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ సలీమా, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం డీఐజీ తబ్సిల్‌ ఇక్బాల్‌, ఐబీ హైదరాబాద్‌ ఎస్పీ దామోదర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైల్వే పరిధిలోని అనుమానిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సినవసరమున్నదని నొక్కి చెప్పారు. మరోవైపు, రైల్వే ట్రాక్‌లపై జరుగుతున్న ప్రమాదాలపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నదనీ, కొన్ని ఘటనలపై ఏమరపాటుతో దర్యాప్తు సాగించటం వలన దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశమున్నదని హెచ్చరించారు. జీఆర్పీలో సిబ్బంది సంఖ్యను పెంచటానికి అవసరమైన ప్రతిపాదనలను తనకు పంపితే ఆ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. నాంపల్లి, ఖాజీపేట్‌ రైల్వే పోలీసు స్టేషన్లు ప్లాట్‌ఫామ్‌లకు సమీపంగా ఏర్పాటు చేయటం వలన బాధితులకు ఫిర్యాదు చేయటానికి సులువుగా ఉంటుందని అన్నారు. అలాగే, రాష్ట్రంలో 12 రైల్వే పోలీసు స్టేషన్లు, 17 రైల్వే పోలీసు అవుట్‌ పోస్ట్‌లు ఉన్నాయనీ, వీటి సమీపంలో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సినవసరమున్నదని తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లు, ప్లాట్‌ఫామ్‌లపై ఏదేనీ అనుమానిత వస్తువులు కనిపించినా.. అనుమానిత వ్యక్తుల సంచారం కనిపించినా.. వాటి గురించి రైల్వే పోలీసులకు వెంటనే సమాచారం అందివ్వాలని ఆయన ప్రయాణికులను కోరారు.