ఈ మధ్యకాలంలో మన తెలుగు క్రికెటర్ పేరు మారుమోగుతోంది. చిన్న వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టి తన సత్తా చాటుతూ.. మాజీ, తాజా క్రికెటర్లతో శబాష్ అనిపించుకుంటున్నాడు. అతను గ్రీజులో నిలబడినంతసేపు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇది ఒక రంజీ, ఐపిఎల్, ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లలో మాత్రమే మనం చూస్తున్నాం. ఇక టీం ఇండియా తరపున బరిలో దిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతడు ఎవరో కాదు. మన తెలుగు కుర్రాడు.. నితీష్ కుమార్ రెడ్డి. తండ్రి కళను నిజం చేస్తూ.. అయన త్యాగాన్ని గౌరవిస్తూ తన ఆటలో ప్రతిభాపాటవాలు చాటుతున్నాడీ యంగ్ క్రికెటర్.
2003 మే 26న విశాఖపట్నంలో నితీష్ రెడ్డి జన్మించాడు. అతడి తండ్రి ముత్యాలరెడ్డి హిందుస్తాన్ జింక్లో పనిచేసేవారు. నితీష్ చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఇష్టంగా ఉండేవాడు. దీంతో తండ్రి పనిచేసే చోట సినియర్లు క్రికెట్ ఆడుతుండగా చూడడానికి తరచూ వెళ్ళేవాడు. ఈ తరుణంలో అతని తండ్రికి జోధ్‌పూర్ బదిలీ అయ్యింది. కానీ కొడుకు క్రికెట్ కెరీర్ కోసం ముత్యాలరెడ్డి ఉద్యోగం విడిచిపెట్టాడు. అప్పుడు నితీష్ వయస్సు 12 ఏండ్లు మాత్రమే.
14 ఏండ్లకే క్రికెట్‌లోకి ఎంట్రీ.
14 ఏండ్లు వయస్సులో విజరు మర్చంట్ ట్రోఫీ (2017-18)లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 176.41 యావరేజ్‌లో 1237 పరుగులు చేయడమే కాకుండా.. బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. దాంతో బిసిసిఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2020లో ఆంధ్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2021లో లిస్టర్ -ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో బీసీసీఐ అవార్డు పొందిన తొలి ఆటగాడుగా నితీశ్ గుర్తింపు పొందాడు.
రంజి ఎంట్రీ
రంజీ ట్రోఫీలో ఆంధ్రా తరపున 2019-20 జనవరి 27 అరగేట్రం చేశాడు. అలాగే 2020-21 విజరు హజారే ట్రోఫీలో ఆంధ్రా క్రికెట్ జట్టు తరపున 2021 ఫిబ్రవరి 20న తన లిస్ట్ ఎ క్రికెట్, 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రా తరపున 2021 నవంబరు 4న తన ట్వంటీ20 ఆరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 17 మ్యాచెస్ ఆడి 566 పరుగులు, 52 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 403 పరుగులు, 14 వికెట్లు తీశాడు. ఆంధ్రా తరపున 8 మ్యాచెస్ ఆడిన నితీష్.. 106 పరుగులు సాధించాడు.
కేరీర్ మార్చిన ఐపిఎల్
దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న నితీష్‌ని ఐపిఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చాలారోజుల తరువాత ఓ తెలుగు ఆటగాడు సత్తా చాటాడు. అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ ఐపిఎల్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపిఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 9 పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ హాప్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్స్‌తో 64 పరుగులు చేశాడు. ఓ దశలో సన్‌రైజర్స్ 120-130 పరుగులు అయినా చేస్తుందా? అనుకుంటే… 182 పరుగుల భారీ స్కోర్ సాధించిందంటే అందుకు కారణం నితీష్. ఈ క్రమంలోనే చెన్నైతో మ్యాచ్‌లో లోయర్ మిడిలార్డర్‌లో దింపింది. ఛేదనలో 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక పంజాబ్‌పై ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి.. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం ఐపిఎల్ 2024 సీజన్‌లో 9 మ్యాచ్‌లలో 239 పరుగులు చేసి, బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేసి నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫిట్ అందుకున్నారు. ఈ ఐపిఎల్‌లో సత్త కారణంగా టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు మన తెలుగు కుర్రాడు.
టింమీడియాకు సెలెక్ట్ .. కానీ
ఆంధ్ర క్రికెట్ ఇది ఒక గుడ్ న్యూస్. అలాగే ఓ తండ్రికి ఇది ఇంకా శుభవార్త. ఆ తండ్రి కల ఇక తీరబోతుంది. అలాగే ఓ యువ క్రికెటర్ మరోసారి ఆంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించడం.. అదీ విశాఖపట్నంకు చెందిన యువ క్రికెటర్ కావడంతో ఇక గర్వంగా చెప్పుకోవచ్చు. నితీష్‌ని జంబాబ్వే టూర్ కి సెలెక్ట్ చేసింది. కానీ అందరు సంతోష పడేలోపే నితీష్‌ని గాయం వెంటాడింది. జింబాజ్వే టూర్ నుంచి నితీష్‌ని గాయం కారణంగా రిలీజ్ చేసి.. అతని స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబేను జట్టులోకి తీసుకుంటున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో టీమిండియా తరపున అరంగేట్రం చేసే బంగారు అవకాశాన్ని కోల్పోయాడు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్..
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఈ ఐపిఎల్ హిరో ఎంపిఎల్ లీగ్ మూడవ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇతన్ని గోదావరి టైటాన్స్, రూ.15.6 లక్షలకు కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది.
దుష్ప్రచారం
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై తనకు ఎంతో గౌరవం ఉందని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ యువ ఆటగాడు తెలిపాడు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని ఎడిట్ చేసి ధోనిపై నెగటివ్‌గా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. ధోని గురించి తాను మాట్లాడిన వీడియోను పూర్తిగా చూడాలని నితీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
వార్నర్ ఏడేళ్ల రికార్డు బ్రేక్
సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో 42 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు. మూడు ఫోర్లతో నితీష్ 76 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఒక మ్యాచ్‌లో ఎనమిది సిక్సర్లు కొట్టిన ఐదో సన్ రైజర్స్ ప్లేయర్‌గా నితీష్ రికార్డ్ నెలకొల్పాడు. అతనికంటే ముందు డేవిడ్ వార్నర్ (2017.కేకేఆర్), మనీష్ పాండే (2020లో రాజస్థాన్ రాయల్స్ )పై ఈ ఘనత సాధించాడు. వీరితో పాటు హెన్రిచ్ క్లాసెన్ (కేకేఆర్‌పై), ట్రావిస్ హెడ్ (ఆర్‌సీబీపై) కూడా సీజన్ ఎనిమిది సిక్సర్లలో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ నలుగురి క్రికెటర్ల సరసన నితీష్ చేరాడు.
పవన్ కళ్యాణ్ పాటలు మంచి ఎనర్జీ
నితీష్ ఇంత బాగా ఆడటానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అంట. మ్యాచ్‌కు ముందు ‘జాని’ సినిమాలోని ”నారాజు గాకురా మా అన్నయ్యా నజీరు అన్నయా ముద్దుల కన్నయ్య” అనే పాటను వింటాటడ. ఈ పాట ఎనర్జీ తనకు బూస్ట్ వస్తుందని చెప్పాడు.
మా నాన్నను తిట్టినవాళ్లే..
”పేరు ప్రతిష్టలు చాలా వింతైనవి. నాకోసం మా నాన్న తన కెరీర్ వదులుకున్నాడు. గతంలో తిట్టిన వాళ్లే ఐపీఎల్ తర్వాత ఆయన ముందు చూపు చూసి పొగుడుతున్నారు. నా ఇండియా కిట్ వచ్చినప్పుడు వాళ్లు ఎమోషనల్ కావడం నాకు గుర్తుంది. ఉద్యోగం వదిలి అందులో వచ్చిన డబ్బును వైజాగ్‌లో మైక్రోఫైనాన్స్ వ్యాపారంలో పెట్టారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన వ్యాపారం సరిగా సాగనప్పుడు మా బంధువులు, సమాజం, అందరూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు” అని నితీష్ చెప్పాడు. అప్పటి వరకూ తాను కూడా ఏదో సరదాగా క్రికెట్ ఆడినా తర్వాత సీరియస్‌గా తీసుకున్నానన్నాడు. ”ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు, వుద్యోగం వదిలేసిన తర్వాత ఆయనతో ఎవరు ఎలా వ్యవహరించారో నేను చూశాను. ఆయనను అవమానించారు. అసలు పట్టించుకోలేదు. అది చూసి తట్టుకోలేకపోయాను. అదే నన్ను మోటివేట్ చేసింది. నా కోసం మా నాన్న అన్నీ వదులుకున్నాడు. అప్పటి వరకు నేను సరదా కోసం ఆడినా.. తర్వాత మొత్తం మారిపోయింది” అని నితీష్ చెప్పాడు. నితీష్ ఎదుగుదలలో తండ్రి పాత్రతో పాటు తల్లి మానస, చెల్లెలు షర్మిలారెడ్డి సహకారం కూడా అంతే వుంది.
– కల్లూరి ఎలెందర్, 9100310115