– నేడు భారత్, పాకిస్థాన్ ఢీ
– విజయమే లక్ష్యంగా టీమ్ ఇండియా
– ఓటమి నైరాశ్యంలో పాక్ శిబిరం
– నేడు రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
దాయాదుల ధనాధన్ ప్రపంచ కమర్షియల్ మార్కెట్ రాజధాని అమెరికా రంగం సిద్ధం చేసింది. నేడు న్యూయార్క్ నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో సమరానికి సై అంటున్నాయి. ఆతిథ్య అమెరికా చేతిలో అవమానకర ఓటమితో పాకిస్థాన్ క్రికెటర్లు నైరాశ్యంలో ఉండగా.. తొలిమ్యాచ్‌లో అలవోక విజయంతో టీమ్ ఇండియా క్రికెటర్లు ఉత్సాహం గా కనిపిస్తున్నారు. అమెరికా వేదికగా భారత్, పాకిస్థాన్ టీ20 థ్రిల్లర్ నేడే.
నవతెలంగాణ-న్యూయార్క్
జోరుమీదున్న భారత్ : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఉత్సాహంగా సిద్ధమవుతుంది. వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో మెరిసిన రోహిత్‌సేన.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై అలవోక విజయం సాధించింది. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లి మినహా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కఠిన పరిస్థితుల్లో స్ఫూర్తిదాయక అర్థ సెంచరీ సాధించాడు. నం.3 స్థానంలో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. వార్మప్‌లో, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో పంత్ అజేయ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. యశస్వి జైస్వాల్ బెంచ్‌కు పరిమితం కానుండగా.. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మరింత బాధ్యత తీసుకోవాలి. రోహిత్ మరోసారి నలుగురు ఆల్‌రౌండర్లతో ఆడనున్నాడు. హార్దిక్ పాండ్య, శివం దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు భారత విజయంలో ఎక్స్ ఫ్యాక్టర్‌గా నిలువనున్నారు. ఇటు బంతితో, అటు బ్యాట్‌తో ఈ నలుగురు మెరిస్తే భారత్‌కు తిరుగుండదు. జశ్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లు స్పెషలిస్ట్ పేసర్లుగా తుది జట్టులో ఉండనున్నారు.
పుంజుకుంటారా? : కీలక మ్యాచ్ ముంగిట పాకిస్థాన్ క్రికెటర్లు ఆత్మవిశ్వాసం కోల్పోయారు. పసికూన అమెరికా చేతిలో ఓటమితో ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కెప్టెన్ బాబర్ ఆజామ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. నేడు భారత్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలిగితే డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో మార్పులు రావచ్చు. పేసర్లు షహీన్ అఫ్రిది, మహ్మద్ ఆమీర్, నసీం షాలపై పాకిస్థాన్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. పేస్ త్రయం భారత బ్యాటర్లను ఇరకాటంలో పడేస్తే.. పాక్ బ్యాటర్ల పని సులభతరం కానుంది. మరి జోరుమీదున్న భారత బ్యాటర్లను పాక్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకార్ అహ్మద్ సహా ఫకర్ జమాన్‌లకు భారత్‌పై మంచి రికార్డుంది. సీనియర్ బ్యాటర్లు న్యూయార్క్ పిచ్‌పై సహనంతో నిలబడితేనే పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వగలిగే పరిస్థితులు ఉన్నాయి.
అజాగ్రత్త వద్దు! : భారత బ్యాటర్లు ఎంతటి ఫామ్‌లో ఉన్న లెఫ్టార్మ్ సీమర్లకు వికెట్లు పారేసుకోవటం అతిపెద్ద బలహీనత. పాకిస్థాన్ శిబిరంలో షహీన్ షా అఫ్రిదికి ఇప్పుడు మహ్మద్ ఆమీర్ తోడయ్యాడు. ఇమద్ వసీంతో పాటు నషీం షా సైతం అత్యంత ప్రమాదకారి. పవర్‌ప్లే సహా మిడిల్ ఓవర్లలోనూ కుడి చేతి పేసర్ల ప్రమాదం పొంచి ఉంది. గతంలో కీలక మ్యాచుల్లో అఫ్రిది, ఆమీర్ భారత్‌ను దారుణంగా దెబ్బతీశారు. న్యూయార్క్‌లో రోహిత్‌సేన ఆ ట్రాప్‌లో పడకుండా చూసుకోవాలి.
పిచ్, వాతావరణం : భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవని తెలుస్తోంది. ఉదయం వేళల్లో ఆటకు ఇప్పటికే ఇరు జట్ల క్రికెటర్లు అలవాటు పడ్డారు. నాసా కౌంటీ స్టేడియం పిచ్ ఇరు జట్ల శిబిరాల్లో గుబులు రేపుతోంది. నేడు మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను వాడనున్నారు. ఫలితంగా అదనపు బౌన్స్, పదునైన పేస్ అనివార్యం. పాకిస్థాన్ పేసర్లకు ఇది పండుగే కానీ.. భారత పేస్ దళం సైతం ఇక్కడ అదరగొట్టగలదు. పరుగుల వేట గగనం కానున్న పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లపై ప్రధానంగా ఫోకస్ ఉండనుంది. ఇక్కడ 160-180 పరుగులు చేయగలిగితే విజయంపై దీమాగా ఉండవచ్చు!. టాస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.