ధ‌న‌నాథుడు

– ‘పొలిటికల్‌’ ఎంట్రీతో భారీ ఖర్చుల నడుమ గణేష్‌ ఉత్సవాలు
– గల్లీగల్లీకీ రెండేసీ వినాయక మండపాల ఏర్పాటుకు నేతల సహకారం
– నేడు నిమజ్జన వేడుకల ఖర్చులకూ డబ్బులిచ్చి మరీ ప్రసన్నం
– కరీంనగర్‌ సెగ్మెంట్‌లోని మండపాల విద్యుత్‌బిల్లులు చెల్లించిన మంత్రి గంగుల
– ఉమ్మడి జిల్లాలో విగ్రహాల కొనుగోలుకే సుమారు రూ.8కోట్ల ఖర్చు…
– నవరాత్రుల నిర్వహణ, నిమజ్జన వేడుకలకు దాదాపు రూ.30కోట్ల ఖర్చుపైమాటే
ఎన్నికలు సమీపించిన తరుణంలో గణేష్‌ ఉత్సవాల్లో పొలిటికల్‌ ఎంట్రీ.. గణనాథున్ని ‘ధన’ నాథున్ని చేసింది. పెద్దఎత్తున యువతను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, నాయకులు అడిగినవారికల్లా చందాలు ఇచ్చారు. పైగా గల్లీగల్లీకి రెండేసి విగ్రహాలు పెట్టుకునేందుకు సహకారమూ అందించారు. నవరాత్రుల నిర్వహణ, అన్నదానాలు, ఇతర కార్యక్రమాల వ్యయాన్నీ భరించారు. నేడు నిర్వహించబోయే నిమజ్జవేడుకలకు అవసరమైన డబ్బులూ అందజేశారు. కరీంనగర్‌ మంత్రి గంగుల కమలాకర్‌ ఏకంగా తన సెగ్మెంట్‌లోని మండపాల కరెంటు బిల్లు రూ.4లక్షలు చెల్లించారు. మొత్తంగా ఈఏడాది పొలిటికల్‌ ఎంట్రీతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విగ్రహాల కొనుగోలుకు సుమారు రూ.8కోట్లు ఖర్చవగా.. నవరాత్రుల నిర్వహణ కలుపుకుని దాదాపు రూ.30కోట్లకుపైగానే ఖర్చయిందనేది ఒక అంచనా.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

వినాయక నిమజ్జనం.. కారాదు విషాదం
నిమజ్జనం జరిగే చెరువులు, కాలువలు, నదులు, జలాశయాల్లో విగ్రహాన్ని దించే సమయంలో వెనుక ఉన్నవారు అత్యుత్సాహం ప్రదర్శించి ఇందులోకి దిగుతారు. ఇలాంటి ఘటనల్లో ఏటా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. చిన్నపిల్లలు, ఈతరాని వారు దూరంగా ఉండటం మేలు. చిన్న వాహనాలపై పరిమితికి మించి బరువైన విగ్రహాన్ని పెట్టడంతోపాటు కుర్రాళ్లు అధిక సంఖ్యలో వేలాడుతుంటారు. తద్వారా వాహనం ఒరగడం, లేదా ప్రమాదవశాత్తు దీనిపై ఉన్నవారు జారి కిందపడే అవకాశం ఉంది. వాహనాలపై డీజేల పేరిట భారీ సౌండ్‌ బాక్సులు పెట్టి వీటిపై యువత కూర్చుంటారు. ఈ క్రమంలో మార్గమధ్యలో కొన్ని చోట్ల వేలాడే విద్యుత్‌ తీగలను గమనించకుంటే కాటేస్తుంటారు. కొందరైతే మద్యం తాగి వేడుకల్లో నానా హంగామా చేస్తుంటారు. ఇదీ ప్రమాదమే. బాణసంచాకు దూరంగా ఉంటే మంచింది. సంప్రదాయ బద్దంగా మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించడం శ్రేయస్కరం.

            రెన్నెళ్లల్లో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార పార్టీ అభ్యర్థులు, విపక్ష పార్టీ ఆశావహులు వినాయక నవరాత్రుల్లో భాగస్వాములు అయ్యారు. సర్వ విఘ్నాలను తొలగించాలని వినాయకుడిని వేడుకునే దశలో ఉత్సవాల ఖర్చుకు ఏమాత్రమూ వెనుకాడలేదు. గణేశుడి ఆశీస్సులు తమకు మెండుగా ఉండాలని నేతలు తమ అనుచరుల ద్వారా గల్లీగల్లీకీ యువతను పోగేసి రెండు, మూడేసి విగ్రహాలు పెట్టుకునేందుకు ఆర్థికసాయం అందించారు. ఉత్సవ కమిటీలకు ఆయా మండపాల నిర్వహకులకు అడిగినప్పుడల్లా ఆర్థిక సాయం చేశారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో అయితే మంత్రి గంగుల కమలాకర్‌ ఏకంగా తన సెగ్మెంట్‌లోని అన్ని మండపాలకూ కలిపి విద్యుత్‌ బిల్లు కింద రూ.4లక్షల చెక్కును రెండు రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులకు అందించారు. ఇలా తమ రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి ఆటంకమూ ఎదురుకావొద్దనే తాపత్రాయం ఆయా నేతల్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం.
నిమజ్జన వేడుకులకు ఏర్పాట్లు.. ఇక జాగ్రత్తలే తదుపరి…
గణపతి నవరాత్రి వేడుకలంటే పులకరించని మనసుండదు. తొమ్మిది రోజుల వేడుక తరువాత వినాయకుని నిమజ్జనం చేసే వేడుక కీలకమే. విగ్రహాలను సాగనంపే క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో కొన్ని సార్లు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న పరిస్థితులూ లేకపోలేదు. ఈ విషయంలో స్వీయ రక్షణే తీపి జ్ఞాపకంగా, నిర్లక్ష్యం తీరని శోకంగా మారుతుంది. నేడు జరగబోయే నిమజ్జనం వేడుకల్లో ఆయా గ్రామాలు, పట్టణాల్లో స్థానికంగా ఉన్న చెరువులు, వాగులు, వంకలు, కాలువలు, నదుల్లో చీకటి పడేవరకూ ఊరేగింపు నిర్వహించి రాత్రి సమయంలో వినాయకున్ని నీళ్లలో వేస్తుంటారు. ఇక్కడే కొందరు ప్రదర్శించే అత్యుత్సాహం ప్రమాదాలకు దారి తీస్తుంది. విద్యుద్ఘాతాలు, రోడ్డు ప్రమాదాలతోనూ ముప్పు పొంచి ఉంటుంది.తద్వారా ఇది వారి కుటుంబాల్లో తీరని వేదనగా మారుతుంది.

గణేశుడు వేరీకాస్ట్‌లీ.. ప్రతివాడకూ రెండేసి మండపాలు
గతంలో ఎన్నడూ లేనవిధంగా ఈసారి వినాయక విగ్రహాల ధరలు భారీగా పెరిగాయి. గతేడాది 1.5ఫీట్ల ఎత్తున్న విగ్రహం రూ.వెయ్యి ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.2వేలు పకలికింది. 3 ఫీట్లు ఎత్తున్న విగ్రహానికి గతేడాది రూ.3500 ఉండగా ఈ ఏడాది రూ.5వేలకు పెరిగింది. 5ఫీట్లు, ఆపై 7 ఫీట్లు ఎత్తున్న విగ్రహాలన్నీ రూ. 15వేల నుంచి రూ.30వేల వరకు ధర పలికాయి. ఇక పోతే 10ఫీట్లకుపైగా ఎత్తున్న విగ్రహాలను రూ.లక్ష నుంచి రూ.3లక్షలు.. ఆపైనే వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ విగ్రహాల కొనుగోలుకు స్థానిక సంస్థల నేతలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల్లో టిక్కెట్‌ ఆశిస్తున్న ఆశావహులు ఖర్చు భరించడంతో గల్లీగల్లీకి రెండు, మూడేసి వినాయక మండపాలు వెలిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 15వేల విగ్రహాలు వెలవగా వాటి కొనుగోలుకే దాదాపు రూ.8కోట్ల వరకు ఖర్చయింది. పైగా మండపాల నిర్వహణ, పూజాసామాగ్రి, ఇతర ఖర్చులకూ డబ్బులు ఇచ్చారు. నేడు జరగబోయే నిమజ్జన వేడులకు వాహనాలు, ఇతర ఖర్చులనూ భరిస్తున్నారు. మొత్తంగా ఈఏడాది గణేష్‌ విగ్రహాల కొనుగోలు, మండపాల నిర్వహణ, నిమజ్జనవేడులకు కలిసి సుమారుగా రూ.30కోట్ల వరకూ ఖర్చయిందంటే అతిశయోక్తికాదు.