– రాఘవయ్య జీవితం ఆదర్శప్రాయం
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ – ఖమ్మంరూరల్
నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ నిలిచిన ధన్యజీవి చెరుకూరి రాఘవయ్య అని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని కామంచికల్లు గ్రామంలో అమరజీవి చెరుకూరి రాఘవయ్య మూడవ వర్ధంతి సభను రఘునాధపాలెం మండల కార్యదర్శి నవీన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవయ్య స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో అనేక పదవులు అనుభవించి, ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే అధికార పార్టీలో చేరి అవకాశాల కోసం అర్రులు చాస్తున్న ఈ రోజుల్లో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొని, జీవితాంతం మార్క్సిస్టుగా జీవించిన వ్యక్తి రాఘవయ్య అన్నారు. రాఘవయ్య జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయమని, ఆదర్శప్రా యమని అన్నారు. కామంచికల్లు ప్రాంతంలో జరిగిన ఓ హత్యలో ప్రత్యర్థులు కుట్ర పన్ని రాఘవయ్య, ఇద్దరు కుమారులను కేసులో ఇరికించారని, వారు ముగ్గురు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో సిపిఎం అభివృద్ధిలో రాఘవయ్య పాత్ర ఎనలేనిదన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు రాఘవయ్య అన్నారు. రాఘవయ్యపై ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలు ప్రయోగించిన ప్రత్యర్థులకు ఏనాడూ లొంగలేదని తెలిపారు. ప్రజా ఉద్యమాల సందర్భంగా ఎవరు జైలుకు వెళ్ళినా జైల్లో వారికి అండగా ఉంటూ వారికి మనో ధైర్యాన్ని నింపే వారిని తెలిపారు. రాఘవయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, నాయకులు పొన్నెకంటి సంగయ్య, పడిగల నాగేశ్వరరావు, భూక్య కృష్ణ, అనంతనేని వీరయ్య, వెంకటేశ్వర్లు, హనుమంత శేషగిరి, గుండు లక్ష్మీనారాయణ, రాఘవయ్య కుమారులు మురళీకృష్ణ, రామకృష్ణ, కుటుంబ సభ్యులు, తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.