ధరణిలో కాళేశ్వరం కన్నా పెద్ద స్కాం

– బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూమి దొంగ అనీ, ధరణి పోర్టల్‌ కాళేశ్వరం కన్నా పెద్ద స్కామ్‌ అని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్‌ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణి వల్ల చాలా మంది భూముల్ని కోల్పోయారని విమర్శించారు. అసలు రెవెన్యూ రికార్డులు ఎక్కడని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో భూమి ఎంత ఉందనే విషయాన్ని ఎందుకు చేయలేదని నిలదీశారు. ధరణి పోర్టల్‌ ముందుగా టీసీఎస్‌కు ఇచ్చారనీ, ఆ తర్వాత వేరే కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పుడా కంపెనీకి ఓనర్‌ ఎవరో కూడా తెలీదన్నారు. ధరణి ముసుగులో అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్ని మాయం చేస్తున్నారని ఆరోపించారు. ధరణి బాధితుల కోసం బీజేపీ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించిందని చెప్పారు dharanicomplaints.bjp@gmail.com కుగానీ, 9391936262, 7330861919, 9281113099, 9281113031 ఫోన్‌ నెంబర్లకు గానీ ఫిర్యాదులు చేయాలని సూచించారు. . తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ధరణి బాగోతంపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. చిదంబరం చెబుతున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వలేదనీ, ఆ పార్టీని దంచి తెలంగాణ ప్రజలు సాధించుకున్నారని చెప్పారు. 1969లో 365 మంది అమాయక విద్యార్థులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. మలిదశ ఉద్యమంలోనూ 1200 మంది ప్రాణాలను పొట్టబెట్టుకున్నదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్‌ కర్కశంగా వ్యవహరించిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం పట్ల కర్కశంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించరన్నారు.