– సీసీఎల్ నవీన్ మిత్తల్
– దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
– కలెక్టర్ ప్రియాంక అలా
– జిల్లా అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ-పాల్వంచ
ధరణి పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని సీసీఎల్ నవీన్ మిత్తల్ కలెక్టర్ ప్రియాంక అలాను ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులపై శుక్రవారం కలెక్టర్లతో సీసీఎల్ నవీన్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి? తాజా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? ధరణి సమస్యల సమగ్ర వివరాలను సీసీఎల్ నవీన్ మిత్తల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ధరణి సమస్యల పరిష్కరించేందుకు చేపట్టాల్సిన మార్గాలపై ఆయన తగిన సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటిని వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ జిల్లాలో 3851 ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, జిల్లా యంత్రాంగమంతా పార్లమెంట్, పట్టభద్రుల ఉప ఎన్నిక ల విధుల్లో నిమగమై ఉన్నందువలన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల్లో 80 శాతం విచారణలు పూర్తి అయినయని, మిగిలిన 20 శాతం రానున్న రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ నందు అనంతరం కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో ధరణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దరఖాస్తులన్నిటినీ త్వరితగతిన విచారణ జరిపి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. రానున్న వారం రోజుల్లో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు మధు, దామోదర్ రావు, డీఆర్‌ఓ రవీందర్ నాథ్, అన్ని మండలాల తహసీ ల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.