నేడు ధర్మా ప్రథమ వర్థ్దంతిని గిరిజన సమ్మేళనం రూపంలో జరుపు కుంటున్నాం. క్యాన్సర్ మహమ్మారితో జీవన,మరణ పోరాటం చేసి 2023 నవంబరు 5న ధర్మా కన్నుమూశాడు. అనారోగ్యంతో వున్నపుడు గతేడాది అక్టోబరు 19న ఆయన్ను చూడ్డానికి నేను, పగడాల నాగేశ్వర్రావు ఇద్దరం కలిసివెళ్లాం. ఖమ్మంలో తన కూతురి ఇంట్లో ఉన్నాడు. మంచి ఆరోగ్యం, పర్సనాల్టీతో, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ధర్మా అనారోగ్యంతో కశించిపోయి, బక్కచిక్కి కూతురి ఇంట్లో సోఫా సెట్‌లో కూలబడి వున్నాడు. చూసిన వెంటనే ధర్మాయేనా అని కాసేపు సందేహించాను. ధర్మా, ధర్మా అని నేను, నాగేశ్వర్రావు ఇద్దరమూ పిలిచాము. ‘నేను సోమయ్యను వచ్చానని’ చెప్పగానే ఎక్కడ లేని శక్తినంతా కూడదీసుకొని బలవంతంగా లేచి నిలబడ్డాడు, కౌగిలించుకున్నాడు, చేతిలో చెయ్యేసి కన్నీరు కార్చాడు. చాలా బాధనిపించింది. బలవంతంగా నేను, నాగేశ్వర్రావు కూర్చోబెట్టి ధైర్యం చెప్పాం, పరామర్శించాం. కన్నీరు తడుస్తూ ‘ఏమీ కాదులే’ అని ఓదార్చాం. ఆ కామ్రేడ్‌తో మాకున్న సంబంధం ఆలాంటిది. దాదాపు యాబై ఏండ్లు మేమిద్దరం అత్యంత సన్నిహితంగా కమూనిస్టు ఉద్యమంలో కలిసిపనిచేశాం. మాకు అదే ఆఖరిచూపు. మేము చూసివచ్చిన కొద్దిరోజులకే ఆయన మర ణించాడు. ధర్మాతో నాకున్న జ్ఞాపకాలన్నీ భారంగా నామదిలో మెదిలాయి.
ఉద్యోగాన్ని వదులుకుని…
ధర్మా కొత్తగూడెం సమీపంలోని మంగపేట వాసి. తండ్రి పోమ్లా నాయక్, తల్లి బీబీల పెద్ద కుమారుడు. పోమ్లానాయక్ వ్యవసాయంతో పాటు, లంబాడీ పెళ్లిళ్లకు పౌరోహిత్యం వహించేవాడు. ఆయన రెండో కుమారుడు భీమా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తున్నాడు. ధర్మా ఐటిఐ చదివి, క్యాంపస్ సెలక్షన్‌లో ఉత్తీర్ణుడై సింగరేణి కాలరీస్‌లో జాయిన్ అయ్యాడు. సింగరేణిలో సిడీఎస్ సమ్మె చాలా ఉధృతంగా జరుగుతున్న రోజులవి. సమ్మెకు సీఐటీయూ ముఖ్య నాయకులందరూ నాయకత్వం వహిస్తూ, సింగరేణి కోల్ ఏరియాలో విస్తతంగా, చాలా బిజీగా తిరుగుతున్నారు.ఈ సమ్మెతో, సీఐటీయూ నాయకత్వంతో ధర్మాకు సంబంధాలు కలిగాయి, పరిచయాలూ పెరిగాయి. దీంతో సమ్మెలో చురుకైన పాత్ర వహించాడు. ఆ కాలంలోనే సీపీఐ(ఎం), సీఐటీయూ కార్యక్రమాల్లో పాల్గొంటూ కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షించబడ్డాడు. కొత్తగూడెంలో ప్రముఖ కమ్యూనిస్టు యోధులుగా వున్న పర్సా, మంచికంటి, ఏలూరి, జార్జి, కంగల బుచ్చయ్య గార్లను ఆదర్శంగా తీసుకున్నాడు. సింగరేణి సంస్థలో అంతవరకు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేయాలనే ధఢ సంకల్పంతో 1974లో హోల్‌టైమర్‌గా చేరాడు. ప్రారంభంలో సీఐటీయూ నేతగా ఉన్న కామ్రేడ్ జార్జి గారి నాయకత్వంలో సింగరేణి కార్మికుల కోసం ఉద్యమించాడు. టింబర్ యార్డు కార్మికులకు సహకార సంఘాన్ని స్థాపించి, కూలీలకు కాంట్రాక్ట్ కూలి మొత్తం పంపిణీ అయ్యే విధంగా పోరాటం చేశాడు. క్రమేణా కూలీలకు సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగాల కోసం కషి చేసి, విజయం సాధించాడు.
పోరాటాలు… విజయాలు
వ్యవసాయ కార్మిక రంగం, మైదాన గిరిజన రంగం (లంబాడీలు)లో దీర్ఘకాలం ధర్మా బాధ్యతలు నిర్వహించాడు. కొత్త గూడెం, సుజాతనగర్, పాల్వంచ, ములకలపల్లి ప్రాంతాల్లో కూలీ, భూ పోరాటాలకు ధర్మా, కాసాని ఐలయ్య, బరపటి సీతారాములు ప్రధానంగా నాయకత్వం వహించి పనిచేశారు. పోడు భూములు, తునికాకు పోరాటాలు, గ్రామాల్లో భూస్వామ్య, పెత్తందార్ల, దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా విస్తతస్థాయిలో వ్యవసాయ కార్మికులను ఈ పోరాటాల్లోకి సమీకరించారు. ధర్మా నాయకత్వంలో తునికాకు కూలీ రేట్ల సమస్యపై సైకిళ్లపై దళాలుగా బయలుదేరి, ఏజెన్సీ గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు, ఆదివాసులు, గిరిజనులు, దళితులు తదితర గ్రామీణ పేదల్లో కార్యకర్తలు విస్తతంగా ప్రచారం చేశారు. కట్ట రేటు పెరుగుదల కోసం తునికాకు కార్మికులు ఆ రోజుల్లో దీర్ఘకాలం సమ్మెలు చేశారు. కార్మికులు విజయం సాధించి రేట్లు పెంచుకున్నారు. ఆ పోరాటాల పునాదే ఈనాడు తునికాకు యాభై ఆకుల కట్టకు రెండు, మూడు రూపాయల వరకు పెరగడం. ఎక్స్‌గ్రేషియో కూడా నేడు ఆ కార్మికులకు అందుతున్నదంటే నాటి పోరాట ఫలితమే. మైదాన గిరిజనుల కోసం (లంబాడీలు, ఎరుకలి, యానాది) ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ”మైదాన గిరిజన సంఘాన్ని” ప్రారంభించింది ఖమ్మం జిల్లాలోనే. ఆ తర్వాత ఈ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అవతరించింది. ధర్మా ఖమ్మం జిల్లా సంఘానికి ప్రధాన కార్యదర్శిగాను, రాష్ట్ర సంఘానికి అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు.
ప్రతి గిరిజన తండాకు విద్యుత్, తాగునీరు, రోడ్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని, అయిదు వందల జనాభా కలిగిన ప్రతి గిరిజన తండాను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలనేే డిమాండ్‌తో ధర్మా పాదయాత్ర నిర్వహించాడు. వందల, వేల సంఖ్యలో గిరిజనులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలు, పెద్ద బహిరంగ సభలు నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కోర్కెల అమలుకు తండాలన్నీ కదిలాయి. ఈ పాదయాత్ర తండాలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఆనాడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఫలితంగానే అయిదు వందల జనాభా గల తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది గత బీఆర్‌ఎస్ సర్కార్. టేకులపల్లి మండలం, కోయగూడెం ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ నిర్మాణంలో ఆ ప్రాంత గిరిజనులు తమ భూములు, నివాసాలు, ఉపాధి అవకాశాలను భారీస్థాయిలో కోల్పోయే సమస్య ఆనాడు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీఐటీయూ, ప్రజా సంఘాలు, గిరిజనులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాయి. ఈ సమస్య హైకోర్టు వరకు వెళ్లింది. ఈ పోరాటాల వల్ల గిరిజనులు ఎట్టకేలకు సింగరేణి సంస్థ నుండి తగిన పరిహారం, మైనింగ్‌లో ఉద్యోగాలు సాధించుకున్నారు. నేటి కోయగూడెం వర్కర్స్ చారిత్రాత్మక విజయం వెనుక నాటి ఇల్లందు డివిజన్ కార్యదర్శిగా ధర్మా నిర్వహించిన కృషి, నిర్వహించిన పాత్ర మరువ లేనిది. ఆ భూపోరాటాల్లో అనేకసార్లు ధర్మాను అరెస్టు చేశారు.జైళ్లలో నిర్భందించారు.అయినా దృఢంగా నిలబడ్డాడు.
ప్రజాప్రతినిధిగానూ సేవలు…
1978 శాసనసభ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా కంగల బుచ్చయ్య గారు పోటీచేశారు. ఈ ఎన్ని కల సందర్భంగా నేను, ధర్మా టేకులపల్లి మండలంలోని సులానగర్ తండాలో ఒక ఎన్నికల సభలో పాల్గొన్నాం. ధర్మా మొదటిసారిగా ఈ సభలో ”లంబాడీ భాష”లో ప్రసంగించాడు. సభలో పాల్గొన్న లంబాడీలందర్నీ ఈ ప్రసంగం ఉత్సాహపరిచింది. ఇది వారిని ఎంతగా ఆకట్టుకుందంటే, వారందరూ ధర్మాను పూలదండలతో సత్కరించారు. కొంతమంది లంబాడీలు డ్యాన్సు చేస్తూ, ధర్మాను ఆలింగనం చేసుకుని, ఎత్తుకుని ఊరేగించారు. లంబాడీ భాషలో ”ధాత్లీ, సుత్తి, తారాకో” మన ఓటంటూ నినదించారు. 1983లో ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా ధర్మా పోటీచేసి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1999లో ఖమ్మం లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా పోటీలో వుండి గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించారు. ధర్మాను పార్టీ ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించినప్పటికీ, అది కొన్ని సాంకేతిక కారణాలతో కార్యరూపం దాల్చలేదు. జూలూరుపాడు జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడు. ఐటిడిఎ నుండి నిధులు రాబట్టి, గ్రామాల్లో అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వ హించాడు. పార్టీ ఏ ఏరియాకు పంపినా, ఏ బాధ్యతలు అప్పగించినా ధర్మా ఏనాడు వెనుకడుగు వేయలేదు.
ధర్మా మంచి కమ్యూనిస్టు, అంకితభావం గల నేత. కమ్యూనిస్టు విలువలు, ప్రమాణాలు, క్రమశిక్షణ, పట్టుదల ఈ సుగు ణాలన్నీ ధర్మా స్వంతం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో మంచి గుర్తింపు కలిగిన నాయకుడు. సామాన్య గిరిజనుల నుండి, అన్ని తరగతుల గిరిజనులు ఆయన్ను ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఈ ప్రత్యేకత రాష్ట్రంలోనూ ఆయనకుంది. పార్టీలో ఆంతరంగిక పోరాటం చేయడంలో కూడా ధర్మా దిట్ట. చర్చల్లో నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, ఎలాంటి శషబిషలు లేకుండా మాట్లాడే స్వభా వం. నేటి రాజకీయాల్లో డబ్బు, సంపాదన, అవకాశవాదం, ఫిరాయింపులు, పదవీ వ్యామోహం విశృంఖలంగా చెలామణి అవుతున్నాయి. ఈ ఒత్తిడులన్నింటిని తట్టుకొని, ధర్మా అయిదు దశాబ్దాల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఒక ఆదర్శ కమ్యూనిస్టుగా, ప్రజాతంత్ర ఉద్యమాలకు ఆయన చేసిన సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం.
పి.సోమయ్య
9490098043