– ఆశాల సమస్యలు పరిష్కరించండి..
నవతెలంగాణ డిచ్ పల్లి
ఆశాలకు కొత్తగా ప్రవేశపెట్టిన పరీక్ష విధానంను వేంటనే రద్దు చేయాలని, బిసిజి సర్వే ను రద్దు చేయాలని ఆశా వర్కర్స్ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షులు బి స్వప్న డిమాండ్ చేశారు. శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బి స్వప్న మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆశ కార్యకర్తలు తిరగబడి ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆశా కార్యకర్తలకు ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రయత్నిస్తుందని దీన్ని అడ్డుకుంటామని ఆమె అన్నారు. ‘రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జిల్లాలో ప్రయోగాత్మకంగా బీసీజీ సర్వే పేరుతో కొత్త సంస్కరణ తీసుకువస్తున్నారని దీన్ని విరమించుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పనులు చేయడానికి సమయం, శక్తి సరిపోవటం లేక సతమతమ వుతున్నామని, కొత్త కొత్త సంస్కరణలు రాష్ట్ర హెల్త్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎగ్జామ్ విధానాన్ని, బీసీజీ సర్వే విధానాన్ని అమలు చేయాలని ఆశా కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆశా కార్యకర్తలు గత 19 ఏళ్ళుగా గ్రామాల్లో బస్తీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్ మాతా శిశు సంరక్షణ, కరోనా వంటి విపత్కర అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజలకు ముందుండి పనిచేస్తున్నారు. నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ వీరిని హెల్త్ గ్లోబల్ లీడర్ గా గుర్తించారు. అలాంటి స్కిల్ ఆశా కార్యకర్తలకు మళ్లీ నూతన ప్రవేశ పరీక్ష విధానాన్ని తీసుకురావడం చాలా శోచనీయం. ఈ ప్రవేశ పరీక్ష పెట్టడం వల్ల ఆశా కార్యకర్తల్లో భయాందోళనలు ప్రారంభం అయ్యాయి. ఉద్యోగులు తొలగించే విధంగా ఈ పద్దతి తీసుకువచ్చారు. ఈ ఎగ్జామ్ వల్ల వీరికి ప్రమోషన్స్ గాని ఏఎన్ఎం వెయిటేజ్ గాని ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రంలో ఎక్కడలేని సర్వే బీసీజీ సర్వే (బాసిల్లస్ కాల్మెట్ గురిన్) జిల్లాలో చేయాలని రాష్ట్ర కమిషనర్ నుంచి సర్కులర్ వచ్చింది. ఈ బీసీజి సర్వేకు ఒక రూపాయి కూడా పారితోషికం ఇవ్వడం లేదన్నారు. అదనంగా జిరాక్స్ ఖర్చులు కూడా ఆశా కార్యకర్తలు భరించేలా చూస్తున్నారని వివరించారు. వారితోషకం లేని బీసీజి సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే జూన్ 24 న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందల్వాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న ఆశాలు ఈ ధర్నాకు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు బండ ప్రమీల, ఎం నిర్మల, బి గంగా లక్ష్మీ, ఎస్ సరితతో పాటు తదితరులు పాల్గొన్నారు.