జులై 3 న డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా

– తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జులై 3న డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ ఏఐటీయూసీ కార్యాలయంలో యూనియన్‌ రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ యూసుఫ్‌, ఎం.నర్సింహులు మాట్లాడుతూ జీవో నెంబర్‌ 60 ప్రకారం కార్మికులకు రూ.15,600 ఇవ్వాల్సి ఉందనీ, అందులో పీఎఫ్‌, ఈఎస్‌ఐ మినహాయించుకున్న తర్వాత రూ.13,600 ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే చాలా ఆస్పత్రుల్లో రూ.11 వేలు మాత్రమే చెల్లిస్తుండగా, మరికొన్ని ఆస్పత్రుల్లో రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా… అధికారులు పట్టించుకోవడం లేదనీ, అందుకే ధర్నా తలపెట్టినట్టు తెలిపారు.