ఆశా వర్కర్ల ధర్నా

– చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన
– దామరచర్లలో మంత్రి పర్యటనతో అరెస్ట్‌
నవతెలంగాణ- విలేకరులు
ఆశా వర్కర్లు శుక్రవారం పలుచోట్ల ధర్నాలు చేశారు. ర్యాలీలు శారు. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆశా వర్కర్ల సమ్మె కొనసాగింది. దామరచర్ల మండలంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటన సందర్భంగా ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేశారు. విడుదల అనంతరం ఆశాలు సమ్మె కొనసాగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టౌన్‌ కేంద్రంలో ఆశ వర్కర్లు ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట దర్నా చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశ వర్కర్ల ధర్నా నిర్వహించి, ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనం తరం తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. యాచారంలో అంగన్‌వాడీల తో కలిసి ఆశావర్కర్లు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. గండిపేటలో కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల పరిస్థితి జీతం చారెడు.. విధులు బారెడు అన్నట్టు ఉందన్నారు. ఆశ వర్కర్ల జీవితం ప్రభుత్వానికి గొడ్డు చాకిరీ చేసేందుకేనా? అని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాల వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. మల్కాజిగిరి చౌరస్తానందు ఆశా వర్కర్లు చెవిలో పువ్వుతో నిరసన తెలిపారు.