జంతర్‌ మంతర్‌లో కుకీల ధర్నా

న్యూఢిల్లీ : మణిపూర్‌లో తమపై జరుగుతున్న దాష్టీకాలను నిరసిస్తూ కుకీ-జో జాతికి చెందిన రెండు వేల మందికి పైగా ప్రజలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఢిల్లీ యూని వర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న తాము మేలో హింస ప్రారంభమైనప్పటి నుండి సరైన తిండి, నిద్ర లేకుండా గడుపుతున్నామని పలువురు విద్యార్థులు వాపోయారు. చదువుపై కూడా సరిగా దృష్టి పెట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్బంధాలు కొనసాగుతుండడంతో మణి పూర్‌కు వెళ్లి కుటుం సభ్యులను కలవలేకపోతున్నామని తెలిపారు. హింసాకాండలో చనిపోయిన కుకీల కుటుంబసభ్యులు తమ కష్టాలు వివరించారు. గత ఆరు నెలల కాలంలో మణిపూర్‌లో పరిస్థితులు ఏ మాత్రం మారలేదని కుకీ-జో మహిళా గ్రూపు వ్యవస్థాపకుల్లో ఒకరైన మేరీ గ్రేస్‌ చెప్పారు. కొద్దికాలం హింసాకాండను నిలిపే సిన మైతీలు తిరిగి దాడులు మొదలు పెట్టారని అన్నారు. ప్రస్తుతం కుకీలు ప్రాణ భయంతో ఆడవుల్లో తలదాచుకుంటున్నారని, వారి ఇళ్లపై దాడి చేసి దోచుకున్నా రని వివరించారు. ‘ఇది కుకీలను కాపాడుకోవడం కోసం చేపట్టిన ఆందోళన మాత్రమే కాదని అర్థం చేసుకోండి. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం జరుగు తున్న ఉద్యమం ఇది. మేము సంఖ్యాపరంగా చూస్తే ఏడు లక్షల మంది మే. కుకీలు నష్టపోవడం అంటే దేశం నష్టపోవడమే. హింస ఇప్పుడే నెమ్మదిగా మొదలైంది. దేశంలో మైనారిటీలకు స్థానం లేకుండా పోతోంది’ అని తెలిపారు. మణిపూర్‌లో మెజారిటీ మైతీలు మైనారిటీ కుకీలను పీడిస్తున్నా రని, ఈ విధానం దేశమంతటికీ వ్యాపిస్తుందని ఆమె హెచ్చరించారు. ధర్నాలో పాల్గొన్న కుకీ జాతీయులు త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేబూని తమ నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన తర్వాత ఆ రాష్ట్రంలో పర్యటించిన నిజ నిర్ధారణ బృందంలో సభ్యుడైన పాత్రికేయుడు జాన్‌ దయాల్‌ ధర్నానుద్దేశించి ప్రసంగించారు. బాధితులు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందని చెప్పారు.