ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట భోజన కార్మికుల ధర్నా

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం, గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేలు ఇవ్వాలని, అన్నారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేతనాలు చెల్లించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకిచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకిచ్చే మెనూ చార్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి, వంట చేసి పెడుతున్నారని దీంతో కార్మికులు అప్పులపాలౌతున్నారన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  చేసిన వాటికే బిల్లులు రాలేదని పైగా రాగి జావ పోయాలని బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. బిల్లులు విడుదల చేయకుండా వండటం ఎలా అని ప్రశ్నించారు. కావున ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని అన్నారు.
గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి
పెరిగిన ధరలకనుగుణంగా పిల్లలకిచ్చే మెనూ చార్జీలు పెంచడం లేదని కార్మికుల జీతాలు పెదగంటా ఉన్న జీతాలు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్మికులకు ఇచ్చే జీతమే తక్కువ అది కూడా రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ పాత మెనూకే సరిపోవడం లేదని మెనూ చార్జీలు పెంచాలని, కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేసి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లోనే వేయాలన్నారు. గుడ్లకు అదనం బడ్జెట్ కేటాయించాలి లేదా అంగన్వాడీ సెంటర్స్ కు సప్లయ్ చేసినట్లుగా మధ్యాహ్న భోజన పధకానికి కూడా సప్లయ్ చేయాలన్నారు. రాగి జావ ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని  కార్మికులకు అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని అన్నారు. అవసరమైన గ్యాస్ ను సబ్బిడీకి ఇవ్వాలని గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలని సామాజిక భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ప్రమాద బీమా, పిఎఫ్. ఈఎస్వి సౌకర్యం కల్పించాలని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలని అన్నారు. ధర్నాలో మధ్యాహ్న భోజన కార్మికులుసంగీత, కవిత, నవీన, రేఖ, సరోజ, గంగమణి ఉన్నారు.