7న ఢిల్లీలో నిర్వాసితుల ధర్నా

– తక్షణమే వరద సహాయక చర్యలు చేపట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
రాజమహేంద్రవరం : గోదావరి వరద బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ కారణంగా మూడేళ్లుగా విలీన మండలాలు పూర్తిగా ముంపునకు గురౌతున్నాయన్నారు. గతేడాది వరదలకు ప్రభుత్వం తాగునీరు కూడా అందించలేకపోయిందని గుర్తు చేశారు. కొండలు, గుట్టలపైకి వెళ్లి నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. టార్ఫాలిన్లు, కొవ్వుత్తులు సైతం అందించలేదని విమర్శించారు. గతేడాది అనుభవాలతో అయినా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నిర్వాసితులకు పునరావాసం తన బాధ్యత కాదంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితులకు అండగా అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. జాతీయ సమస్యగా పరిగణించి ఆగస్టు 7న ఢిల్లీలో జరగబోయే ధర్నాకు తరలి రావాలని కోరారు. పోలవరంపై పార్లమెంటులో వైసిపి, టిడిపిలకు చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంలో తొలుత నిర్వాసితులకు న్యాయం చేయాలని సెక్షన్‌ 90 స్పష్టంగా చెబుతోందన్నారు. పునరావాసం కేంద్ర ప్రభుత్వం బాధ్యతేనని తెలిపారు. ప్రాజెక్టు అంచనా విలువ రూ.55 వేలకోట్లలో రూ.35 వేల కోట్లు పునరావాసానికే ఖర్చు చేయాలని తెలిపారు. ఈ గణాంకాలే పునరావాసం ప్రాధాన్యతను వివరిస్తున్నాయన్నారు. పోలవరం నిర్వాసితుల పోరాటానికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 1.06లక్షల కుటుంబాలల్లో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రాబోయే ఎన్నికల్లో పొత్తులపై ఓ విలేకరి ప్రశ్నించగా… బిజెపితో ప్రత్యక్షంగా.. పరోక్షంగా కలిసి పనిచేసే పార్టీలతో కలిసి వెళ్లబోమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జనసేన, బిజెపిల పొత్తు ఆత్మహత్యా సదృశ్యమన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న అనేక ప్రాంతీయ పార్టీలు భూస్థాపితం అయ్యాయని, వర్తమాన రాజకీయాలే ఒక ఉదహరణ అని వివరించారు. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్‌, టిడిపి అధినేత చంద్రబాబు ఖచ్ఛితమైన అభిప్రాయం ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. యుసిసిని మైనార్టీలే కాదు హిందూ మహిళలు కూడా అంగీకరించబోరన్నారు. ఆ చట్టం అమల్లో ఉన్న గోవాలోని బహుభార్యత్వాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాల అవసరం ఉందని చెప్పారు. వైసిపి, జనసేన, టిడిపిలు గోడమీద పిల్లుల్లా వ్యవహరించడం తగదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, నగర కార్యదర్శి బి.పవన్‌ పాల్గొన్నారు.