ఆర్‌ఆర్‌ఆర్‌ భూ బాధితుల ధర్నా

– రూ.7 లక్షలా 50 వేలకు గుంట భూమి రాదని ఆవేదన
నవతెలంగాణ- గజ్వేల్‌
రీజనల్‌ రింగ్‌ రోడ్‌లో భూములు పోతున్నాయని గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రైతులు ధర్నా చేశారు. బుధవారం ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.18 లక్షలు కేటాయించగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడు లక్షల 50 వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ కోసం రైతులను రమ్మని చెప్పి.. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గజ్వేల్‌ ఐఓసీ గేటు మూసేసి ధర్నా చేశారు. కోటిన్నర విలువ చేసే ఎకరా భూమికి రూ.7 లక్షలా 50 వేలు పరిహారం ఇస్తే బయట గుంట భూమి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రైతులతో చర్చించి.. ఆందోళనను విరమింపజేశారు.