మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ధర్నా

నవతెలంగాణ-ఇల్లందు
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇల్లందు మండల విద్యా శాఖ అధికారి కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించి విద్యా శాఖ అధికారి పిల్లి శ్రీనివాస్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జరిగిన సభలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌హెచ్‌ సుల్తానా, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్‌ నబి పాల్గొని మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవాలని, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి, మెనూ చార్జీలు పెంచాలి, కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి. రాగి జావ కాయడానికి గ్యాస్‌ సరఫరా చేయాలి. తదితర డిమాండ్ల సాధనకు ఈ నెల 24న జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ మాట్లాడారు. యూనియన్‌ మండల కార్యదర్శి కుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఐలమ్మ, కనకమ్మ, మీరా, కౌసల్య, యాదమ్మ, సరిత, జయ సుభద్ర, వీరమ్మ, సమ్మక్క, సుజాత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
గుండాల : మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి విద్యా శాఖాధికారి కార్యాలయంలో మెసెంజర్‌ ఎవరూ లేనందున వినతి పత్రాన్ని గోడకు అంటించామని యూనియన్‌ మండల కార్యదర్శి నజ్మ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పొంబోయిన లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని, మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. పెండింగ్‌ వేతనాలు సత్వరమే చెల్లించాలని, మెనూ చార్జీలు పెంచాలని, కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని. అదేవిధంగా రాగి జావ కాయడానికి గ్యాస్‌ సరఫరా చేయాలని చెప్పారు. మధ్యాహ్నం భోజన కార్మికుల డిమాండ్ల సాధనకు ఈ నెల 24న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయ, పాపమ్మ, మంగి, అచ్చి, బుల్లి, సోన, విజయ, భారతి, తదితరులు పాల్గొన్నారు.