
భువనగిరి మండలం లోని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22, 23 తేదీలలో గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు, 29వ తేదీన మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. బుధవారం సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ సమావేశం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరు మల్లేశం అధ్యక్షతన జరుగగా సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా అనేక గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. సీపీఐ(ఎం) పోరుబాటలో భాగంగా ఈనెల ఒకటి నుంచి గ్రామాలను పర్యటిస్తే గ్రామాలలో నేటికీ రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్తు, లింకు రోడ్లు, కాలువల పైన బ్రిడ్జిల నిర్మాణం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాలలో సర్పంచుల పరిపాలన లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన అభివృద్ధి కుంటుపడిందని చాలా గ్రామాలలో చెత్త పేరుకుపోయి దోమలు ప్రజలను కుట్టడంతో అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. నేటికీ అనేకమంది పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేక అవస్థలు పడుతున్నారని వారందరికీ ప్రభుత్వము తక్షణం ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. ఇంకా పెన్షన్స్ రేషన్ కార్డులు లేనివారు కూడా అనేకమంది ఉన్నారని వారందరికీ వెంటనే ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాలలో పెద్దపెద్ద కాలువల పైన బ్రిడ్జి నిర్మాణం చేయవలసి ఉన్నదని, కొన్ని గ్రామాలలో విద్యుత్తు సమస్య ఉన్నాయని, మరికొన్ని గ్రామాలలో భూముల సమస్యలు కూడా ఉన్నాయని వీటి పరిష్కారం కోసమే పంచాయతీ కార్యాలయాల ముందు, తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నర్సింహ కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, మోటే ఎల్లయ్య లు పాల్గొన్నారు.