ఢీ అంటే ఢీ.!

Dhi means Dhi.!– కేసీఆర్‌ మాటలకు తుమ్మల, పొంగులేటి కౌంటర్‌
– బీఆర్‌ఎస్‌ మాజీ నేతలపై పువ్వాడ ఆగ్రహం
– దీటుగా కౌంటర్‌ ఇచ్చిన ‘హస్తం’ నేతలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మాటలయుద్ధం రోజురోజుకూ తారాస్థాయికి చేరుతోంది. బీఆర్‌ఎస్‌ మాజీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.
సీఎం వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్‌
పాలేరు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ కూసుమంచి మండలం జీళ్లచెరులో శుక్రవారం నిర్వ హించారు. ఇందులో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొంగులేటి పేరు ప్రస్తావించకుండా డబ్బుల కట్టల అహంకారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు పేరు ప్రస్తావిస్తూ.. 2014 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చుంటే పాత మిత్రుడని చేరదీసి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టా నని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌కు తుమ్మల అన్యాయం చేశారా? తుమ్మలకు బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందా? అన్న వ్యాఖ్యలపై వెంటనే ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల స్పందించారు. కేసీఆర్‌తోపాటు పువ్వాడ అజరుకి కూడా కౌంటర్‌ ఇస్తూ మాట్లాడారు. పోటాపోటీగా విలేకరు ల సమావేశం ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఢ అంటే ఢ అనే రీతిలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
కేసీఆర్‌కు తుమ్మల.. తుమ్మలకు అజయ్
పాలేరు ఆశీర్వాద సభలో తనపై కేసీఆర్‌ చేసిన ఆరోపణలకు తుమ్మల గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. తనకు కేసీఆర్‌ పదవి ఇచ్చారు సరే.. ఎన్టీఆర్‌తో మాట్లాడి కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించినదాన్ని ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు పువ్వాడతోపాటు ఎంపీలు నామ, వద్దిరాజు, పాలేరు, వైరా నియోజకవర్గ అభ్యర్థులు కందాల ఉపేందర్‌రెడ్డి, మదన్‌లాల్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘ఎన్టీఆర్‌కు మీరు చెబితే కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వడానికి ఆనాడు మీరేమైనా మంత్రా? పార్టీ అధ్యక్షులా?’ అని తుమ్మలను ప్రశ్నించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్‌ కొండబాల కోటేశ్వరరావు.. తుమ్మల గతాన్ని ఏకరువుపెట్టారు. పువ్వాడ.. ‘2018 ఎన్నికల్లో మీ ఇద్దరు చెప్పినట్టుగానే టిక్కెట్లు ఇస్తే ఆయన్ను ఈయన, ఈయన్ను ఆయన పొడుచుకు చంపుకుని ఓడించారని తుమ్మల, పొంగులేటిని ఉద్దేశించి కేసీఆర్‌ ఐదేండ్ల కిందటే అన్నారని..’ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే కాంగ్రెస్‌ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టి పొంగులేటి.. కేసీఆర్‌, పువ్వాడకు కౌంటర్‌ ఇచ్చారు.
కేసీఆర్‌ పార్టీలో ఒరిగిందేమీ లేదన్న పొంగులేటి
కేసీఆర్‌ పార్టీలో తనకు ఒరిగిందేమీ లేదని, వందలసార్లు అల్లుడు, కొడుకు తన చుట్టూ తిరిగి తేనే ఆ పార్టీలో చేరానని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో కన్వీ నర్‌ పొంగులేటి అన్నారు. ఆ పార్టీలో తాను ఏ పదవులూ అనుభవించలేదన్నారు. నాకు ఇచ్చిన కాంట్రాక్టులు, వర్క్‌లు ఏంటో కేసీఆర్‌ తడిగుడ్డలతో ప్రమాణం చేసి చెబుతారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించింది కేసీఆరే అన్నారు. దమ్ముంటే పాలేరులో తనపై పోటీ చేయాల్సిందిగా సవాల్‌ విసిరారు.