ఒక్కొక్కసారి ఒక పుస్తకమో, ఒక వ్యక్తో, ఒక సంఘటనో మన దృక్కోణంలో మార్పు (Paradigm Change) కి కారణం అవుతారు. అప్పుడు మన లోపల కొన్ని విస్ఫోటనాలు జరిగి, మనం లోకం పట్ల చూసే చూపు నిశితమవుతుంది. జరుగుతున్న విషయం విధ్వంసమా, వినిర్మాణమా అర్థం చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది. ఆ పని చేసిన ఒక పుస్తకం గురించి ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ పుస్తకం ఒక సాధారణ బాలిక తన కల్లోలిత బాల్య తలపోతల గురించి, ఒక ముస్లిం యువతి తనకెదురైన చేదు అనుభవాల గురించి, ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక భారతీయ పౌరురాలు తన దేశ అల్లకల్లోలాల గురించి, అంతర్జాతీయంగా బడుగు దేశాల మీద పెట్టుబడిదారులు చేస్తున్న యుద్ధోన్మాద దాడుల గురించి ఏమాత్రం వెరవని ఒక దృఢ స్వరంతో, ఒక ప్రజా కార్యకర్త వేదనతో మాట్లాడుతున్న విషయాల గురించి చర్చిస్తుంది. ఆ పుస్తకమే మౌమితా ఆలం అనే బెంగాలీ కవయిత్రి రాసిన కవిత్వం తెలుగులో అనువదితమైన ‘రాయకూడని పద్యం’.
ఎందుకు ‘రాయకూడని పద్యం’ అని పేరు పెట్టారంటే ఈ పుస్తకానికి పేరు లేని సంపాదకురాలిగా వ్యవహరించిన రమాసుందరిగారు మౌమితా కవిత్వం గురించి ఇలా అంటున్నారు. ‘ఆమె పద్యాలు కాలాతీతంగా న్యాయం కోసం అలమటిస్తున్న వారి గురించి పుంఖానుపుంఖాలుగా, నిరంతరంగా మాట్లాడతాయి. స్త్రీగా, ముస్లిం స్త్రీగా, వెనుకబడిన ఉత్తర బెంగాల్ ప్రాంతానికి చెందిన ముస్లిం స్త్రీగా, ఒంటరి తల్లిగా – ఆమె అస్తిత్వం అంతటితో పరిమితం అవకుండా ప్రాంతాలు, భాషలు, దేశాలు, జాతులు, మతాలు దాటి – విశ్వ బాధితుల పక్షాన నిలబడింది’. బాధితుల పక్షాన నిలబడటమంటే రాజ్య ధిక్కారమే కదా.
పైగా మౌమితా అంటుంది ‘నిజానికి రాజ్యానికి కావాల్సింది (ప్రతి విషయంలోనూ) మౌనాంగీకారమే. ఇక్కడే, నిరసనకారులు నిశ్శబ్దాన్ని ఛేదించేది. గడ్డకట్టిన మౌనాలను ఛేదించి తమ గొంతు వినిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే జైళ్ళు, సంకెళ్ళు. ఈ మౌనాన్ని వెక్కిరించడానికే, బద్దలు కొట్టడానికే నేను రాస్తాను’. మరి రాజ్యానికి ఎదురుగా నిలబడి రాసేది రాజ్యద్రోహులే కదా. అందుకే మౌమితా రాసేది ‘రాయకూడని పద్యం’ అయింది.
కవిత్వం హృదయాన్ని కదిలించాలనుకుంటే ఈ కవిత్వం హృదయాన్ని పెల్లగిస్తుంది. మనసును మూగబోయేలా చేస్తుంది. కవిత్వం ఎక్కడ వుందీరోజుల్లో అనేవాళ్ళకి చేయి పట్టుకొని ‘ఢిల్లీలో ఒక హాస్పటల్’ కవిత చూపించండి. అక్కడ ఒక తల్లి తన కొడుకు ఖండిత అవయవాలు వేసిన బస్తా పట్టుకొని గాజుకళ్ళతో ఎదురు చూస్తుంటుంది. సమస్తాన్ని సంచిలో కుక్కుకుని కరోనా కాలంలో గమ్యం చేరని నడక నడుస్తూ శవమై తేలనున్న ‘మంగూరాం’ కనపడతాడు. కరోనా తరిమి కొడితే దిక్కుతోచక కడుపు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ చీకట్లోంచి ప్రయాణించి బయటపడే మట్టికొట్టుకుపోయిన మనుషులు కనపడతారు. పాలకూరని కూడా గొడ్డు మాంసంగా కావాలని పొరబడేవారు, భయపడుతూ ప్రయాణం చేసే ‘రైల్లో ముస్లింలు’ తగులుతారు. జకియా దు:ఖం ఘనీభవించినపుడు, బిల్ఖిస్ ముక్కలై గుమిగూడినపుడు, వాళ్ళ కోసం నిలిచిన తీస్తా సెతల్వాద్ పరిచయం అవుతుంది. ‘సరిహద్దు ముళ్ళ కంచెకు/ చిరిగిన వస్త్రాలై వేలాడే’ ఫేలానీ, సముద్ర తీరానికి శవమై కొట్టుకొచ్చిన బాలుడు అలాన్ కుర్దీలు తారసపడతారు. మొత్తంగా జవజవలాడే మనిషి కొనజీవంతో ఒక చిన్ని సహాయ హస్తం కోసం చేతులు చాస్తూ ఈ కవిత్వం నిండా కనిపిస్తారు.
ఆశ్చర్యంగా మౌమితా ఆలం కవిత్వంలోని తీవ్రత, గాఢత నివ్వెరపరుస్తుంది. ఎందుకంటే రాజకీయ అంశాలను కవిత్వం చేసేటపుడు సాధారణంగా వచనం జారిపోతూ వుంటుంది. కానీ మౌమిత ఎక్కడా వచనమై జారిపోదు. చిక్కని కవిత్వమై మదిలో మంట పెడుతుంది. ఊహించని ఉపమానాలతో, ఊహకందని వస్తువుతో కవితని దట్టిస్తుంది. వ్యక్తీకరణలో అవసరమైనచోట ఒకసారి ఆర్థ్రంగా, ఒకసారి వ్యంగ్యంగా, ఒకసారి నిరసనగా, ఒకసారి ధిక్కారంగా, ఒకసారి ప్రేమమయిగా అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. ఒక బాలికగా, ఒక యువతిగా, ఒక ముస్లిం స్త్రీగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక అమ్మగా తనని తాను వ్యక్తీకరించుకున్న కవిత్వం ఇందులో వుంది. ఉటంకించాలంటే ఇందులో ప్రతి కవితలోనూ పేర్కొనవలసిన వాక్యాలు వున్నాయి. శీర్షికలు కూడా కవిత్వం మాట్లాడతాయి.
”మాట్లాడాల్సిన చోట/మౌనంలోకి జారుకునే..
‘ఎముకలు కుళ్ళిన, రక్తం చచ్చిన’/ సమస్త పరాన్నజీవుల ప్రతినిధిని” అని బానిస కవుల్ని ఛీత్కరించినా..
‘చావడానికి/ మనకు కారణాలుంటాయేమో గాని/ చంపడానికి/ వాళ్ళకు ఏ కారణమూ ఉండక్కరలేదు’ అని రాజ్యాన్ని ఈసడించినా.. ‘ప్రేమే విప్లవం../ విప్లవమే ప్రేమ’ అని యుద్ధరంగాన్ని ఒక తెంపరితనంతో ముద్దాడుదాం అన్నా..
‘మేం గర్భ సంచులం గాదు/ పురుషాధిక్యతపై పిడికిలెత్తిన/ సమరయోధుల’ మని ప్రకటించినా..
‘మా సమాధి పలక మీద ఏం రాస్తారో/’మీ పేరే మీ చావుకు కారణం’/ అని కచ్చితంగా చెక్కిపెడతారు.’ అని
విద్వేషాన్ని నిలదీసినా… ‘వికసించే మొగ్గలోనూ/ పెగులుకొచ్చే మొక్కలోనూ/ మోసులెత్తే కలల్లోనూ/ కవి ఉంటాడు/ అక్కడ నువ్వుంటావు… ప్రతి కొండ గుండె నీ కోసం/ స్వాతంత్య్ర పాలస్తీనా కోసం ప్రతిధ్వనిస్తుంది” అని పాలస్తీనా కవి రెఫాత్ అలరీర్ గురించి వలపోసినా.. మౌమితా కవిత్వం గొప్ప జవంతో, అనుకంపనతో పఠితను చుట్టుకుంటుంది.
‘పద్యాన్ని ఇలా మాత్రం రాయకూడదు’, ‘జెండా పండుగకు జేజేలు’, నేనెవర్నీ’, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’, ‘రాజు గారూ – రాజ్యమూ’ లాంటి కవితల్లో మౌమిత వ్యంగ్యంతో ముంచెత్తుతుంది. చదివి తీరాల్సిన కవితలు ఇవి. రాజ్యం విసిరే పెనుకొమ్ముల మధ్య పొగరుగా నిలబడి వాక్యంతో ఢకొీనడం మాటలు కాదు. ఇంత మాట్లాడినా తన ఇస్లాం సహన మార్గం విడవదు. ”మేమిక్కడే వుంటాం/ తుఫాను గడిచాక/ నిటారుగా నిలబడే గడ్డిపోచల్లాగ/ సడలని మా విశ్వాసాల్తో కదం తొక్కుతుంటాం/ మసీదులో నిర్భయంగా అజాు వినిపిస్తాం/ ప్రేమ, శాంతి, సోదర భావం కోసం/ అలుపెరుగని పిలుపునిస్తాం” అని తన లక్ష్యం ప్రకటిస్తుంది. అందుకే మౌమితా ఆలం ధీర.
ఈ కవితలు చక్కగా అనువాదం చేసిన ఉదయమిత్ర గారు అక్కడక్కడా ఇంగ్లీషు మాతృక కవితల నుంచి కొంత విస్తరించి రాసి, కొంచెం ఎడంగా పోయినట్టు కనిపిస్తుంది. అయితే సారం చెడకుండా రాయడం ఊరట. దీతీవఙఱ్y ఱర ్‌ష్ట్రవ రశీబశ్రీ శీట ్‌ష్ట్రవ జూశీవ్తీy అంటారు కదా.. అనువాదం చేసేటప్పుడు ప్రాంతీయ భాషను వాడగా నేను చాలా అరుదుగా చూసాను. అనువాదకుడు తన తెలంగాణ పాలమూరు మాండలికం అక్కడక్కడా ఉపయోగించడం అందంగా అమరింది. సమకాలీనంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలను శక్తివంతంగా సృజించిన మౌమితా ఆలం కవితలను తెలుగు చేసి పాఠకులకు అందించడం ‘మాతృక’ ప్రచురణలు బాధ్యతగా చేసిన గొప్ప పని. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి తీరాలి. నస్రీన్ ఖాన్ విపులమైన ముందుమాట పుస్తక ద్వారాన నిలబడిన ఒక ఆహ్వాన వీచిక.
ప్రస్తుత ప్రపంచ రాజకీయ యుద్ధోన్మాద సందర్భంలో పెచ్చుమీరుతున్న అరాచక అభివృద్ధిని, వినాశనాన్ని పలు విధాలుగా మనకి అర్థం చేయించే శక్తివంతమయిన పుస్తకం ఈ ‘రాయకూడని పద్యం’. ఈ పుస్తకం చదవడం ఒక ఉద్విగ అనుభవం.
– పి.శ్రీనివాస్ గౌడ్, 9949429449