కాంగ్రెస్‌ హయాంలో.. మైనార్టీలకు ఢోకా

– తల నరుక్కుంటాం కానీ ఢిల్లీకి గులాం కాబోం
– కేసీఆర్‌ పక్కా లోకల్‌ : రోడ్‌ షోల్లో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-కంఠేశ్వర్‌/భిక్కనూర్‌
‘కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు అందరూ సంతోషంగా ఉన్నారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్‌ మైనారిటీల సంక్షేమానికి రూ.12,780 కోట్లు ఖర్చు చేస్తే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీ రూ.930 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.” అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూర్‌లో శనివారం రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ రెండూ ఒకటేనని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని, కానీ ఇప్పటి వరకు కేసీఆర్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ గొంతు నిక్కాలని మోడీ-షా చూస్తున్నారని, తాము వాళ్లకు భయపడేదీ లేదని తెలిపారు. తల నరుకుంటాం కానీ ఢిల్లీ వాళ్లకు మెడ వంచబోమని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే బీజేపీకి లాభం కలుగుతుందన్నారు.
కామారెడ్డినియోజకవర్గం భిక్కనూర్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి ఇస్తున్న సలాకా సిమెంట్‌లకు ఓట్లు రావన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కేసీఆర్‌ నాన్‌ లోకల్‌ కాదని, కోనాపూర్‌ గ్రామం ఆయన తల్లిగారి ఊరైనని, లోకలేనని తెలిపారు. నాయకులకు పైసలు ఆశ చూపి కొనుక్కోవడం రేవంత్‌ రెడ్డికి అలవాటేనని, రూ.50 లక్షలతో దొరికిన దొంగకు కామారెడ్డి ఓటర్లు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రజలు తరిమికొడితే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, అక్కడ చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన కామారెడ్డి జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించి కామారెడ్డి జిల్లాను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.