– మహి కోసం అభిమానుల ఎదురుచూపు
– నేడు సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ ఢీ
మహేంద్రసింగ్ ధోని.. భారత క్రికెట్‌లో అభిమానుల గుండె చప్పుడు. అత్యంత విజయవంతమైన కెరీర్‌లో చివరి అంకంలో అలరిస్తున్న మహేంద్రుడి కోసం తెలుగు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశాఖ తీరంలో ఇప్పటికే ‘ఎల్లో సముద్రం’ చూసిన ధోని నేడు ఉప్పల్‌లోనూ అటువంటి అనుభూతి పొందనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం కాంక్షిస్తూనే… ఎం.ఎస్ ధోని విన్యాసాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు.
నవతెలంగాణ-హైదరాబాద్
అందరూ అనుకుంటున్నట్టు ఎం.ఎస్ ధోని కెరీర్ చివరి ఐపీఎల్ సీజన్‌లో ఫ్యాన్స్ టూర్‌లో ఉన్నాడు!. ధోని అడుగుపెట్టిన ప్రతిచోట అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. చెపాక్ స్టేడియం వీడి తొలుత తెలుగు రాష్ట్రాల్లోనే అడుగుపెట్టిన మహేంద్రుడు నేడు ఉప్పల్ స్టేడియంలో మెరువనున్నాడు. ఐపీఎల్ 17 సీజన్ గ్రూప్ దశ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో సూపర్‌కింగ్స్ నేడు సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమవుతోంది. బ్యాటింగ్ లైనప్ అదిరేలా కుదిరినా.. బౌలింగ్ బలహీనత సన్‌రైజర్స్ శిబిరంలో కలవరం రేపుతోంది. నేడు రాత్రి 7.30 గంటలకు సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ సమరం ఆరంభం. చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడిన గత ఐదు మ్యాచుల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. చివరగా 2022లో చెన్నైపై హైదరాబాద్ గెలుపొందింది. నేడు ఉప్పల్‌లో ఆ రికార్డును సన్‌రైజర్స్ మెరుగుపరుస్తుందేమో చూడాలి.
ఆ ఇద్దరు రాణిస్తే…
సన్‌రైజర్స్ హైదరాబాద్ సంప్రదాయంగా భీకర బౌలింగ్ విభాగం కలిగిన జట్టు. ఉప్పల్ స్టేడియం సైతం ఐపీఎల్‌లోనే అత్యల్ప స్కోర్లకు వేదిక. కానీ ఈ సీజన్‌లో ఈ రెండూ మారాయి. సన్‌రైజర్స్ బ్యాటింగ్ మెరుగవగా.. ఇదే సమయంలో బౌలింగ్ లైనప్ బలహీనపడింది. బౌలింగ్ విభాగం ప్రధానంగా కెప్టెన్ పాట్ కమిన్స్‌పై ఆధారపడింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆశించిన ప్రభావం చూపటం లేదు. ఈ సీజన్లో భువనేశ్వర్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. 10.92 ఎకానమీతో పరుగులు ఇస్తున్న భువనేశ్వర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఉమ్రాన్ మాలిక్ వేగంపై పెట్టిన దృష్టి.. వైవిధ్యంపై నిలుపటం లేదు. ఫలితంగా పేస్‌ను వాడుకుంటున్న బ్యాటర్లు అలవోకగా బౌండరీలు బాదుతున్నారు. జైదేవ్ ఉనద్కత్ నిలకడ లేకపోయినా ఫర్వాలేదు అనిపిస్తున్నాడు. మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్‌లు స్పిన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. కానీ మిడిల్ ఓవర్లలో ఆశించిన ప్రభావం చూపించటం లేదు. బ్యాటింగ్ లైనప్‌లో మయాంక్ అగర్వాల్ భారంగా మారాడు. మూడు మ్యాచుల్లో కేవలం 59 పరుగులే చేశాడు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగుతుండగా.. మయాంక్ అగర్వాల్ కనీసం వన్డే స్థాయి ఆట తీరు కనబరచటం లేదు. ట్రావిశ్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఎడెన్ మార్‌క్రామ్ మరోసారి సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నారు. బ్యాట్‌తో మయాంక్ అగర్వాల్, బంతితో భువనేశ్వర్ కుమార్ రాణిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుండదు.
చెన్నైలో నయా జోశ్
తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన సూపర్‌కింగ్స్.. విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడినా గెలిచినంత సంతోషంగా కనిపించింది. ఈ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చిన ఎం.ఎస్ ధోని మునుపటి జులపాల మహిని గుర్తు చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. ధోని దంచికొట్టిన ఉత్సాహంలో సూపర్‌కింగ్స్ నేడు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. లోతైన బ్యాటింగ్ లైనప్ సూపర్‌కింగ్స్ ప్రధాన బలం. రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డార్లీ మిచెల్, శివం దూబె, రవీంద్ర జడేజా మంచి ఫామ్‌లో ఉన్నారు. యువ సంచలనం సమీర్ రిజ్వీ తనదైన ఇన్నింగ్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రెహమాన్ నేడు ఆడేది అనుమానంగా ఉంది. ముస్తాఫిజుర్ రెహమాన్ లేకపోయినా చెన్నై బౌలింగ్ విభాగానికి వచ్చిన లోటేమీ లేదు. మతీశ పతిరణ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే అంచనాలను అందుకుంటున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకుడిగా, ఆటగాడిగా మెప్పిస్తున్నాడు. ఓటమి తర్వాత ఆడుతున్న మ్యాచ్‌లో జట్టును రుతురాజ్ ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి.
పరుగుల పిచ్
ఉప్పల్ పిచ్ సంప్రదాయంగా బౌలర్లకు అనుకూలం. భారీ స్కోర్లు నమోదు కావటం అత్యంత అరుదు. కానీ ఈ సీజన్లో సన్‌రైజర్స్ యాజమాన్యం బ్యాటింగ్ పిచ్‌ల వైపు మొగ్గుచూపింది. నేడు సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌కు సైతం పరుగుల పిచ్‌నే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇరు జట్లు భీకర బ్యాటింగ్ లైనప్ కలిగి ఉండటంతో ఉప్పల్‌లో నేడు మరోసారి పరుగుల వరద పారనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.