మేరు నగధీరుడు, కార్మిక ఉద్యమ ధృవతార, ఒక జంఝామారుతం,ఏఐఐఇఏ (అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం)ను సమున్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన మార్గదర్శి సరోజ్ చౌదరి బీమా ఉద్యోగులకే గాక,మొత్తం కార్మిక వర్గానికి స్పూర్తి ప్రధాత.ఆయన ఒక ధృవతార, హిమాలయ శిఖర సమానుడు, విజ్ఞానఖని, మేధావి, చరిత్రకారుడు, సామాజికవేత్త, పోరాటాల రూపశిల్పి.రాజకీయాలలో, ఆర్థికశాస్త్రంలో, చరిత్ర, కళలు, సాహిత్యం, భూగర్భశాస్తం వంటి శాస్తాల అవగాహనలో ఆయన ఘనాపాఠీ.అన్నాపవలవో బ్యాలట్ నృత్యాలపైనా, షేక్సిపియర్ సాహిత్యంపైనా, సత్యజిత్‌రే సినిమాల పైనా, పాశ్చాత్య ఆధునిక సంగీత కచేరిలపైనా, సంగీత పరికరాలపైనా ఇలా ఎలాంటి విషయం పైనైనా ఆయన పరిజ్ఞానం అసాధారణం.
సరోజ్ చౌదరి బంగ్లాదేశ్‌లో 1మార్చి1927లో జన్మించారు.1946లో హిందుస్తాన్ కో-ఆపరేటివ్ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లర్క్‌గా చేరారు.నళినిరంజన్ సర్కార్ బీమా కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా బీమా ఉద్యోగులు చేపట్టిన 2 గంటల ధర్నాలో ప్రసంగించడం వలన సరోజ్ వాక్పటిమ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది.అప్పటికే బీమా ఉద్యోగులను సంఘటితం చేసే కృషిలో ఉన్న సునీల్ మైత్రా, ఇతర బీమా నాయకులు సరోజ్‌లో ‘లీడర్’ ను చూడగలిగారు. అలా మొదలైన ఆయన ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. 1959లో ఏఐఐఇఏ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సరోజ్ 1988 వరకు ఆ బాధ్యతలో కొనసాగారు. ఆయన దార్శనికత, కార్మికవర్గ తాత్విక చింతన అజరామరం.దోపిడీలేని ప్రపంచం సాధించబడాలని ఆయన పరితపించారు.
”ఎక్కడ పీడనలేని సమాజం ఆవిష్కరించబడుతుందో
ఎక్కడ స్తీ పురుషులు సమానంగా చూడబడతారో
ఎక్కడ చిన్న పిల్లలు బిచ్చమెత్తే దుస్థితిలో ఉండక, పూలవలే వికసిస్తారో
ఎక్కడ స్త్రీలు తమ శరీరాలను అమ్ముకునే దౌర్భాగ్యం ఉండదో
ఎక్కడ గులాబీ రేకులపై పడిన తొలి కిరణాల వెలుగు తళుక్కుమంటుందో
అలాంటి సమాజాన్ని ఏఐఐఇఏ కోరుకుం టోంది” అని ప్రకటించిన సృజనశీలి సరోజ్. కార్మికవర్గ విముక్తికి సోషలిజం స్టాపనే శరణ్యమని స్ఫూర్తివంతంగా ప్రకటించిన ధీశాలి. చనిపోయే నాటికి సీఐటీయూ అఖిల భారత కోశాధికారిగా ఉన్నారాయన.
మేరు నగధీరుడైనా,సోదర కార్మికులతో కలసి వినయ పూర్వకంగా ముచ్చటించేతత్వం, అసమానుడైనా సమిష్టి నిర్ణయాలకు కట్టుబడే వైజం, సహచర నాయకులలో క్యాడర్లలో స్పూర్తిని నింపేతత్వం సరోజ్ వ్యవహారశైలికి అద్దం పడుతుంది.హిందుస్తానీ సంగీతమైనా, రవీంద్రుని సంగీతమైనా అది ఆయనకు సుపరిచితం. సంగీతాన్ని,నాటకాలను ఆస్వాదించడం మాత్రమే కాదు, వాటిలో తప్పొప్పులు సైతం చెప్పగల దిట్ట సరోజ్. ఏ భాష సాహిత్యమైనా, ఏ సంస్కృతి అయినా ఆయనకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కలకత్తాలో ఆనాటి ఈస్టన్ జోనల్ లైబ్రరీలో ఉన్న అనేక సాహిత్య గ్రంథాలను,ప్రబంధాలను సరోజ్ అవుపాసన పట్టేసారు. సరోజ్ ఆ లైబ్రరీలో చదవని పుస్తకం లేదట.ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యాన్ని దేనిని ఆయన వదలకుండా చదివేవారు.
మాటకుమాట బదులివ్వడంలో సరోజ్‌కు సాటిలేరు.1974 వేతన సవరణ ఒప్పందం ఖరారైన తర్వాత యాజమాన్యం ఆయనతోఎప్పుడూ ఏఐఐఇఏ ఎందుకు విజయాలు సాధిస్తుందని అడిగారట.దీనికి ఆయన తడుముకోకుండా ‘మేము మీకంటే కొంచెం తక్కువ అసమర్ధులం’ అన్నారు.. ఆనాటి ఎల్‌ఐసి ఛైర్మన్ ఏంఆర్.బీడే ఒకసారి ఏఐఐఇఏతో చర్చల సంద ర్భంగా నేను మీ వాదనలను అంగీకరించటం లేదు అన్నారు. దానికి బదులిస్తూ సరోజ్ ‘మా వాదనలు మిమ్ములను ఒప్పించలేవు, మా శక్తి తప్పక మిమ్ములను ఒప్పిస్తుంది’ అన్నారు.అనేక అంశాలపై ఆయన రాసిన శీర్షికలు, చేసిన ప్రసంగాలు నేటికి మనకు ఆదర్శంగా నిలుస్తాయి. ఫిబ్రవరి,1995 ఇన్సూరెన్స్ వర్కర్‌లో సరోజ్ మత్స్యకారుల సమస్యలపై ఒక వ్యాసం రాసారు. మత్స్యకారుల జీవితాలను బహుళజాతి కంపెనీల ట్రాలర్లు ఏ రకంగా చిదిమేస్తున్నాయో సోదాహరణంగా వివరించారు. ఆయన నాడు ప్రస్తావించిన సమస్యలు నేడు ఏపీలోని గంగవరం తదితర పోర్టుల కింద బతుకులీడ్చే మత్స్యకారుల సమస్యలకు అద్దం పట్టడం విశేషం. ఆయన దీర్ఘదర్శి. ఉద్యోగులను సౌఖ్యం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో కొన్ని దశాబ్దాల కిందటే వెల్లడించారు ”మధ్య తరగతి ప్రజా నీకంలో తమకు తెలియకుండానే సౌఖ్యం అనేది ఒక అతిధిలా వచ్చి స్వార్ధ చింత నకు దారితీస్తుందని” ఆయన అంటారు.నిర్లిప్తత ఎలాంటి ఉద్యమాన్నైనా నాశనం చేస్తుందని,ఉద్యమం ముందుకు సాగితేనే ఉద్యోగులకు మను గడ ఉంటుందని సరోజ్ అనేవారు.
1998లో హైదరాబాద్‌లో జరిగిన ఏఐఐఇఏ సమావేశాల్లో (సరోజ్ చివరి ప్రసంగం) సోషలిజానికి కాలం చెల్లిందంటూ పుస్తకం రాసిన ఫుకుయమను ఆయన నిశితంగా విమర్శిస్తూ సోషలిజం అజేయమని ప్రకటించారు.మనుషుల మెదళ్లను మొద్దుబరుస్తున్న టీవీ మాధ్యమాన్ని, వినిమయదారీ సంస్కృతిని ఆయన తూర్పారపట్టారు.కేవలం లైంగిక వాంఛలు తీర్చు కోవడం మనిషి లక్ష్యం కారాదని,మెరుగైన సమాజ రూపకల్పనకై ప్రతిఒక్కరూ ఉద్యమించాలన్నారు.విశ్వకవి ఠాగూర్‌ను ఉటంకిస్తూ మనిషిపై విశ్వాసం కోల్పోవడం పాపమన్నారు.ఇది సరోజ్ దార్శనికతకు నిదర్శనం. ప్రభుత్వరంగంలో ఎల్‌ఐసి, జిఐసి సంస్థలను పరి రక్షించాలని అహర్నిశలూ కృషి చేసిన ఆయన ప్రజలను, పాలసీదారులను భాగాస్వాములను చేయాలని పరితపించారు. ఏఐఐఇఏ సమావేశాలు మధురైలో జరిగినప్పుడు ఆయన పాలసీ దారులకు విశిష్ట సేవలందిం చాలని సమావేశ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన పాలసీదారులకు సత్వర సేవలందించ డంలో ప్రాముఖ్యం ఇవ్వాలని ఆయన ఉద్యోగులను కోరారు. ఎప్పుడు ప్రజలు,పాలసీదారులు ఎల్‌ఐసిని తమ సొంతఆస్తిగా భావిస్తారో, అప్పుడు వారు తప్పక మన పోరాటాలకు మద్దతిస్తారని ఆయన అన్నారు.
యూనియన్ నాయకత్వం అంటే మొరటుగా వ్యవహరించేవారని నానుడి ప్రచారంలోనున్న కాలంలో ఆయన ఆ భావనకు భిన్నంగా వ్యవహరించారు.సమాజాన్ని, మారు తున్న పరిస్థితులను నిరంతరం అధ్యయనం చేసే సరోజ్ యువ కామ్రేడ్లను నిరంతరం అధ్యయనం చేయమంటూ ప్రోత్సహించే వారు.మానవ పరిణామక్రమాన్ని గతి తార్కికంగా అధ్యయనం చేసిన సరోజ్ సోషలిస్టు సూత్రాల హేతుబద్ధతను,శాస్తీయతను వివరించేవారు.సోషలిజం స్థాపన ఆచరణ సాధ్యమే అన్న ఆయన విశ్వాసం తిరుగులేనిది.నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగు తున్న అనేక పరిణామాలు ఆయన విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయి.ఆయన వర్గస్పృహ అజరామరం.వర్గ పోరాటాల విశిష్టతను వివరిస్తూ ఆయన చెప్పిన మాటలు మన చెవులలో నేటికి మారుమోగుతూనే ఉంటాయి.
”వర్గాలుగా చీలిపోయిన సమాజంలో ఏ ఒక్క హక్కు సదు పాయం యాజమాన్యం దయతో ఇచ్చింది కాదు.ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతిదానికి నిరంతరం పోరాటం చేశాం.అవి కొనసాగుతాయన్న భ్రమలు మనకుండకూడదు. మనం పోరాడుతున్నంత కాలం మాత్రమే వాటిని రక్షించుకోగలం.” ఏఐఐఇఏను వర్గపోరాట సంస్థగా రూపాంతరం చేయడానికి అహర్నిశలూ కృషిచేసిన సరోజ్ 17జూన్1999న మృతి చెందారు. భౌతికంగాఆయన దూరమైనా, ఆయన భావజాలం బీమా ఉద్యోగులను, అశేష కార్మికవర్గాన్ని ముందుకు నడిప ిస్తూనే ఉంది. సరోజ్ ఆకాంక్షించిన దోపిడీ రహిత సమాజ స్థాపనకై నడుం బిగించడమే బీమా ఉద్యోగులు ఆయనకిచ్చే నిజమైన నివాళి.
పి.సతీష్
9441797900