‘న.మో’ని హిట్లర్‌, గోబెల్స్‌ ఆవహించారా!

'న.మో'ని హిట్లర్‌, గోబెల్స్‌ ఆవహించారా!ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సంఘ పరివార్‌ నేతలను హిట్లర్‌, గోబెల్స్‌ ఆవహించినట్టు కనిపిస్తోంది. లేకుంటే ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ-కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వారు అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని, బాలరాముడిని తిరిగి గుడారాల్లో కూర్చో పెడతారని నరేంద్ర మోడీ చెప్పేవారు కాదేమో! ఇంతకీ ఆయన ఎందుకిలా మాట్లాడినట్టు? వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక కథనంలో రచయిత ఎవరో తెలియదు గానీ నరేంద్ర మోడీ-హిట్లర్‌ మధ్య ఒక పోలిక తెచ్చారు. ఒక మతం వారు దేశానికి వ్యతిరేకులనే భావాన్ని హిట్లర్‌ తలకు ఎక్కించుకున్నాడు. హిట్లర్‌ను ఎవరైనా విమర్శిస్తే మద్దతుదార్లు సహించేవారు కాదు. అన్ని రకాల మీడియాను తన గురించి గొప్పలు చెప్పుకోవటానికి హిట్లర్‌ ఉపయోగించుకున్నాడు. తన వ్యతిరేకులందరినీ అణచివేశాడు. వారు దేశ ద్రోహులని, జాతి వ్యతిరేకులని ఎల్లవేళలా పిలిచాడు. అన్ని సమస్యలనూ స్వల్ప కాలంలోనే పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు. మంచి రోజులు రానున్నాయన్నది హిట్లర్‌ నినాదం. మంచి దుస్తులు వేసుకొని అందంగా కనిపించేందుకు హిట్లర్‌ చూసేవాడు. అబద్దాలను నిజాలుగా భ్రమింపచేసే కళను హిట్లర్‌ ప్రదర్శించేవాడు. రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చేందుకు హిట్లర్‌ ఇష్టపడేవాడు. స్నేహితులు, సోదరులు, సోదరీమణు లంటూ తన ప్రతి ప్రసంగంలో హిట్లర్‌ మాట్లాడేవాడు. హిట్లర్‌కు ఫొటోలు తీయించుకోవటమంటే పిచ్చి. పైన పేర్కొన్న వాటిలో నరేంద్ర మోడీకి ఏ లక్షణాలు ఉన్నాయో లేవో ఎవరికి వారు బేరీజు వేసుకోవచ్చు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన లేదా జరిపిన ప్రచారంలో ‘ఇండియా’ వేదిక బీజేపీ విధానాలపై విమర్శలతో పాటు ఆ వేదికలోని పార్టీలు విడివిడిగా ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలను, బీజేపీ చెబుతున్నట్టుగా నాలుగు వందల సీట్లు ఎందుకు కోరుతున్నదో, ఏం చేసేందుకు అన్ని సీట్లు కోరుతున్నదో స్పష్టంగానే ప్రచారం చేశాయి. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందన్నది ప్రధానమైన విమర్శ. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ఎంతసేపూ ఎన్ని మరుగుదొడ్లు కట్టించిందీ, ఎన్ని ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిందీ, రోడ్లు వేసిందీ చెప్పుకోవటం తప్ప జన జీవితాలను మెరుగు పరిచేందుకు చేసిందేమిటో పెద్దగా చెప్పలేదు. పచ్చి అవాస్తవాలను, ఆధారం లేని ఆరోపణలను ఎన్నింటినో స్వయంగా నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతగా వక్రీకరణ, అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేసిన ప్రభుత్వ నేత మరొకరు లేరన్నది వేరే చెప్పనవసరం లేదు. మీడియాలో ఎన్ని టీవీ ఛానళ్లు వాటి గురించి చర్చలు పెట్టాయి, ఎన్ని పత్రికలు ప్రముఖంగా విశ్లేషణలు, వాస్తవాలను వెల్లడించాయి? ఇదేం ప్రచారం అన్నట్లుగా కొందరు గొణగినట్లు విమర్శించటం తప్ప గట్టిగా బట్టబయలు చేసే ధైర్యం చేయటం లేదు. విదేశీ మీడియాలో కూడా ఇదే వ్యక్తమైంది.
నరేంద్ర మోడీ ఇన్ని పచ్చి అబద్దాలను ప్రచారం చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటి? పలుకుబడి దిగజారుతున్న పూర్వ రంగంలో ఒక్క మైనారిటీ విద్వేషంతోనే లాభం లేదని గ్రహించి కాబోలు ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారంటూ హిందువులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి మసీదులు, చర్చిలను కూల్చివేసిన చరిత్ర కాషాయ దళాలది తప్ప ఇతర పార్టీలది కాదు. రోడ్ల విస్తరణ పేరుతో నరేంద్ర మోడీ సీఎంగా ఉండగా అహమ్మదాబాద్‌లో కొన్ని మందిరాలను కూడా తొలగించారన్న వార్తలు తెలిసిందే.కొందరు పనిగట్టుకొని పదే పదే తప్పుడు సమాచారాన్ని మెదళ్లలోకి ఎక్కిస్తే జనం ఎందుకు నమ్ముతున్నారనేది ప్రశ్న. దీని గురించి భిన్న కోణాలు వెలువడుతున్నాయి. తమ ముందుకు వచ్చిన ఒక సమాచారం వాస్తవం కాదని తెలిసినప్పటికీ అది పదే పదే వేర్వేరు మార్గాల్లో చేరితే ‘ఏమో నిజమేనేమో!’ అనే సందేహంలో పడతారు. బ్రాహ్మణుడు-మేకపిల్ల కథ తెలిసిందే. దానికి ప్రతిగా సమాచారం లేకపోతే చివరికి నిజమని నమ్ముతారు. ఉదాహరణకు వైరస్‌తో జలుబు చేస్తుంది. నిజానికి దానికి మందు లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారే వైరస్‌కు వెంటనే మందు కనుగొనటం సాధ్యం కాదు. ఏదైనా బిళ్ల వాడితే వారంలో వాడకపోతే ఏడు రోజుల్లో జలుబు తగ్గుతుందన్న లోకోక్తి తెలిసిందే. మన శరీరంలోని రోగ నిరోధకశక్తి ఆ వైరస్‌ను ఎదుర్కొన్న తరువాత అదే తగ్గిపోతుంది. కానీ అనేక మంది ఫలానా బిళ్ల వేసుకుంటే మాకు తగ్గింది అని చెప్పారనుకోండి, కొంతకాలానికి మిగతావారు పోయేదేముంది మనమూ చూద్దాం అని ఆ బిళ్లలనే వాడతారు.
మరో ఉదాహరణ చెప్పుకుందాం. పొట్టను తగ్గించాలంటే సూక్ష్మంలో మోక్షంలా ఫలానా మిషన్‌ వాడితే తగ్గిపోతుందనే ప్రచారం తెలిసిందే. ఒకసారి చూద్దాం పోయేదేముంది అనుకొని అనేక మంది కొనుగోలు చేయటం, ఆయిల్‌ పుల్లింగ్‌, మంచి నీటి వైద్యాల వంటి వాటికి బుర్రలను అప్పగించటం చాలా మందికి తెలిసిందే. ఇలాంటి వాటి వలన వ్యక్తులు నష్టపోతారు. అదే ఒక ప్రతికూల భావజాలానికి చెవి అప్పగిస్తే యావత్‌ సమాజానికే ప్రమాదకరం. ప్రతి మనిషి సగటున రోజుకు 35 వేల నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు పరిశోధకులు చెప్పారు. ఒక షర్టు ఆరటానికి అర్ధగంట పడితే పది షర్టులు ఎంతసేపటిలో ఆరతాయంటే ఐదు గంటలు అనేవారు, ఒక కిలో దూది బరువా ఒక కిలో ఇనుము బరువా అంటే ఇనుము అని చెప్పేవారి గురించి తెలిసిందే. అంటే ప్రతి క్షణానికి మన మెదళ్లకు ఎంతో సమాచారం అందుతుంటుంది. బహుశా ఈ కారణంగానే వెంటనే బుర్రకు తర్కం కూడా తట్టదు. మన బుర్రలో రెండు రకాల ఆలోచనా వ్యవస్థలుంటాయట. ఒకటి అదుపులేని స్పృహతో తక్షణమే స్పందించేది, రెండవది స్పృహతో దీర్ఘంగా, లోతుగా ఆలోచించి నిర్ణయించేది. జనాలు మొదటిదానికే ఎక్కువగా పనిపెడతారని, అందువలన లోతుగా ఆలోచించకుండా చేసే పద్ధతులు, సమాచారాన్ని కొన్ని శక్తులు మన బుర్రలకు చేరవేస్తాయని భావిస్తున్నందున హిట్లర్‌ వంటి నియంతలు, మార్కెటింగ్‌ నిపుణులు, రంగులు మార్చే రాజకీయవేత్తలు ప్రతి తరాన్ని ఏదో విధంగా మభ్యపెట్టగలుగుతూనే ఉన్నారు.అఫ్‌కోర్స్‌! పెరుగుట విరుగుట కొరకే. హిట్లర్‌ను ఆరాధించిన జర్మన్లే ఇప్పుడు ఆ పేరు ఎత్తటానికి కూడా ఇచ్చగించరు. ‘వాడొక కుక్క’ అంటారు. ఎవరికైనా అదే గతి.
– సత్య