న్యూస్‌క్లిక్‌లో పెట్టుబడులు పెట్టలేదు !

In Newsclick No investment!– చైనా నుంచి నిధులు రాలేదు
– నా విరాళాలు అన్నీ నా స్వంత సంపాదనే
– భారత్‌ ప్రాదేశిక సమగ్రతను దెబ్బ తీయాల్సిన అవసరమే లేదు
– నాలుగు పేజీల లేఖను విడుదల చేసిన నెవిల్లె రారు సింగమ్‌
షాంఘై : న్యూస్‌క్లిక్‌పై దాడి కేసులో నిందితుడుగా ఢిల్లీ పోలీసులు చేర్చిన అమెరికన్‌ కోటీశ్వరుడు నెవిల్లె రారు సింగమ్‌ తనపై ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ నాలుగు పేజీల లేఖను మంగళవారం విడుదల చేశారు. పోలీసులు చేసిన ప్రతి ఆరోపణను ఖండిస్తూ ఆయన వివరణ ఇచ్చారు. న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వ్యాసం తప్పుదారి పట్టించేదని, పరోక్ష దాడికి ఉద్దేశించిందని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను షాంఘైలో నివసిస్తున్నానని, తాను పుట్టినప్పటి నుండి కేవలం అమెరికన్‌ జాతీయుడిగా మాత్రమే వున్నానని పేర్కొన్నారు.
న్యూయార్క్‌ టైమ్స్‌లో వ్యాసం ప్రచురితమైన 12 రోజుల తర్వాత, ఢిల్లీ పోలీసులు రహస్యంగా ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారని ఆ లేఖ పేర్కొంది. అప్రతిష్టపాల్జేసే ఆరోపణలు, అభియోగాలు, తప్పుడు అంశాలతో నిండిన ఆ ఎఫ్‌ఐఆర్‌తో దాదాపు వందమంది జర్నలిస్టులను ఇంటరాగేట్‌ చేశారు. డజన్ల సంఖ్యలో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ అరెస్టుల ప్రహసనం పూర్తయిన తర్వాత, ఎఫ్‌ఐఆర్‌ను వెల్లడించారు. అందులో తనతో పాటూ చాలామందికి పరువు నష్టం కలిగించేలా ఆరోపణలు చేశారని ఆ లేఖలో నెవిల్లె రారు పేర్కొన్నారు. భారత్‌తో తనకు గల సన్నిహిత సంబంధాలను ఆయన ఆ లేఖలో వివరించారు. 2000 దశకం ప్రారంభంలో భారత్‌లో తన ఐటి కంపెనీ థాట్‌ వర్క్స్‌ కార్యాలయాలను ప్రారంభించానని చెప్పారు. అనేకమంది భారతీయ సహచరులతో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు.
ఈ ఏడాది జులై 22న అంటే న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాసం ప్రచురణ తేదీకంటే ముందుగానే వాస్తవ ఖండనలన్నింటినీ అందచేశానని, కానీ ఆ పత్రిక వాటినేవీ ప్రచురించలేదన్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రయోజనాలను న్యూయార్క్‌ టైమ్స్‌ దెబ్బతీసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికకు అందచేసినవి, వారు పట్టించుకోని అంశాలను ఈ లేఖలో వెల్లడించానన్నారు. న్యూస్‌క్లిక్‌లో తాను పెట్టుబడులు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే చైనా నుండి, చైనా కమ్యూనిస్టు పార్టీ నుండి సహా ఏ దేశం లేదా రాజకీయ పార్టీల నుండి తనకెలాంటి నిధులు రాలేదని చెప్పారు. ఆ మేరకు వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన కంపెనీని విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాలు, తన వ్యక్తిగత పొదుపు మొత్తాలు, తాను సంపాదించింది తప్ప అదనంగా బయట నుండి వచ్చిన నిధులేవీ లేవన్నారు. ప్రతి ఏటా పన్నులు కూడా సక్రమంగా కడతానని కాబట్టి తన డబ్బుపై సందేహాలు అనవస రమని స్పష్టం చేశారు. చైనా టెలికం కంపెనీలతో తనను ముడిపెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిం చారు. ఎఫ్‌ఐఆర్‌లో అదిచూసి తాను దిగ్భ్రాంతి చెందానన్నారు. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా వాటితో తనకెలాంటి సంబంధం లేదన్నారు. చైనా ప్రభుత్వం లోని, చైనా కమ్యూనిస్టు పార్టీలోని ఏ విభాగంతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. వారి నుండి నిధులు గానీ, ఆదేశాలు గానీ తనకు రాలేదని, వారి కోసం ఎప్పుడూ పనిచేయలేదన్నారు. అక్రమ రీతుల్లో నిధులను పంపించడం గాదనీ, ఏ చట్టాలను అతి క్రమించడం గానీ జరగలేదన్నారు. తన వద్ద వున్న డబ్బును జయప్రదంగా అవసరమైన వారందరికీ విరాళాలుగా ఇవ్వాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఆ లక్ష్య సాధనలో తాను ఏ నియమ నిబంధనలనూ అతిక్రమించలేదన్నారు. ప్రపంచంలో దారిద్య్రాన్ని సమూలంగా శాశ్వతంగా నిర్మూలించేందుకు అంకితమైన ప్రాజెక్టులకు సాయపడాడలన్నది తన కీలక లక్ష్యమన్నారు. భారత్‌ సమగ్రతను దెబ్బతీసేలా ఓపెన్స్‌ సోర్స్‌ మ్యాప్‌ ప్రాజెక్టును రూపొందించారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారని, కానీ భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు విఘాతం కలిగించాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు.