– విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు
నవతెలంగాణ-శంషాబాద్
”గత ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యం వహించినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం.. వెంటనే డైట్ బిల్లులు విడుదల చేయాలి.. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి” అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా 25వ మహాసభ శనివారం శంషాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు నడుస్తున్నా ఇప్పటివరకు పెండింగ్ ఉపకార వేతనాలు, హాస్టల్ బిల్లులు చెల్లించలేదన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ బిల్లులు ఇవ్వక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. డైట్ బిల్లులు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో ఎప్‌సెట్, నీట్ కోచింగ్ ఇవ్వాలని, ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు మెడిసిన్, బీడీఎస్, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి కోర్సులకు ఉచిత కోచింగ్ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్, జిల్లా అధ్యక్షులు కేవై ప్రణరు, ఉపాధ్యక్షులు మస్కు చరణ్, సంఘం నాయకులు పాల్గొన్నారు.