– పేద బిడ్డలను అక్కున చేర్చుకున్నాం
– విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా ప్రభుత్వంలో డైట్‌చార్జీలను పెంచి పేదబిడ్డలను అక్కున చేర్చుకున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నతస్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. దీని ద్వారా మొత్తం 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పేద విద్యార్థుల అరిగోస తెలిసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని హాస్టళ్లలో ఉండే పిల్లలకు 40 శాతం డైట్‌చార్జీలను పెంచారని పేర్కొన్నారు. విద్యార్థులకు, విద్యార్థునులకు కాస్మోటిక్ చార్జీలను కూడా పెంచడం హర్షనీయమని తెలిపారు. డైట్ చార్జీల పెంపును ఒక బీసీ బిడ్డగా, మంత్రిగా తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లకాలంలో ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలు, నిరుపేద విద్యార్థుల కోసం అనునిత్యం పని చేస్తుందని స్పష్టం చేశారు. అందుకే, దీపావళి సందర్భంగా అట్టడుగు బిడ్డలను కాంగ్రెస్ సర్కారు ఆదుకున్నదని వివరించారు.