– రెచ్చిపోయిన పట్నం, పైలట్ వర్గీయులు
– చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో లొల్లి
– సర్దిచెప్పిన మాజీ మంత్రి హరీశ్‌రావు
– బీఆర్‌ఎస్‌లో బయటపడ్డ అంతర్గత కుమ్ములాటలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అధికారంలో ఉన్నన్నాళ్లూ బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో అణిగిమణిగి ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు దుర్భాషలాడుతూ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లిపోయారు. వారి అనుయాయులు మరో అడుగు ముందుకేసి బాహాబాహీకి దిగేందుకు రెడీ అయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన సీనియర్ నేతలు మధ్యాహ్న భోజన విరామాన్ని ప్రకటించటం ద్వారా ‘కుర్చీలు లేవకుండా’ చూడగలిగారు. బీఆర్‌ఎస్ నాయకుల్లో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి శుక్రవారం బయటపడింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంటు స్థానం సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు కొట్టుకునే దాకా పరిస్థితి వచ్చింది. తొలుత రోహిత్ తన అనుయాయుల్లో కొంత మందిని వేదిక ముందు భాగంలో కూర్చోబెట్టారు. వారిని అక్కడ కూర్చోబెట్టటంపై పట్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మహేందర్‌రెడ్డి మాట్లాడటానికి ప్రయత్నిస్తే పైలట్ వర్గీయులు ఆయన్ను అడ్డుకున్నారు. ‘మహేందర్‌రెడ్డి వల్లే రోహిత్‌రెడ్డి ఓడిపోయారు. పట్నం ఒక దొంగ, వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, ఇప్పుడు ఎంపీ రంజిత్‌రెడ్డిని ఓడించేందుకు ఆయన పావులు కదుపుతున్నాడు…’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పట్నం తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి లోనయ్యారు. నాటకాలు వేయొద్దంటూ వారిని హెచ్చరించారు. ఈ దశలో షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి జోక్యం చేసుకుని, పైలట్ వర్గీయులపైకి ఉరికారు. దీంతో ఇరు వర్గాల మధ్య కుర్చీలు పైకి లేచినంతగా పరిస్థితి చేజారింది.
తీవ్రతను గమనించిన మాజీ మంత్రి హరీశ్‌రావు… భోజన విరామ సమయాన్ని ప్రకటించారు. దీంతో ఉద్రిక్తత కొంత తగ్గుముఖం పట్టింది. అనంతరం పైలట్, పట్నంతో హరీశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘సమీక్షా సమావేశంలో బహిరంగంగా గొడవ పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి…’ అని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే భోజన విరామనంతరం కూడా సమావేశంలో ఇదే వేడి కొనసాగింది. సమీక్ష అయిపోయిన తర్వాత ఒక మాజీ ఎమ్మెల్యే మీడియా ప్రతినిధుల ఎదుట తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ఇంకెంత కాలం తప్పులను దాస్తారు.. మా నోళ్లకు తాళాలెందుకు వేస్తున్నారు… ఇలా అయితే అంతా మీరే చూసుకోండి…’ అంటూ ఆయన అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోవటం గమనార్హం. సన్నాహక సమావేశంలో మాజీ స్పీకర్లు మదుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితోపాటు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీలు పాల్గొన్నారు.
నేడు ‘పెద్దపల్లి’పై సమీక్ష…
శనివారం పెద్దపల్లి ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎంపీ వెంకటేశ్ నేతగానితోపాటు ఆ నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ సన్నాహక సమావేశానికి హాజరుకానున్నారు. కాగా శుక్రవారం నాటి సమీక్షకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేదు. అలసటతోపాటు జ్వరంతో బాధపడుతుండటం వల్లే ఆయన రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.